రేపు..బుధవారం(జూలై9) భారత్ బంద్.. ఎందుకు ఈ బంద్..స్కూల్స్, బ్యాంకులకు సెలవు ఉందా..?

రేపు..బుధవారం(జూలై9) భారత్ బంద్.. ఎందుకు ఈ బంద్..స్కూల్స్, బ్యాంకులకు సెలవు ఉందా..?

దేశవ్యాప్తంగా రేపు, జూలై 9, 2025 (బుధవారం) భారత్ బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు,వాటి అనుబంధ సంస్థలు ఈ బంద్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపనున్నాయి.   

సమ్మె ఎందుకు?

రైతులకు మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్టు పద్ధతిలో శ్రామిక శక్తి నియామకం,  నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు , సామాజిక రంగాలైన విద్య, ఆరోగ్యంపై బడ్జెట్ తగ్గించడం, కార్మిక చట్టాలను సవరించడం, కార్మికు లకు  సమ్మె చేసే హక్కులను పరిమితం చేయడం వంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.  

ALSO READ | పిల్లలపై ప్రేమతో దివాళా తీస్తున్న రిటైర్డ్ పేరెంట్స్ : ATMలా వాడేస్తున్న కొడుకులు, కూతుళ్లు!

కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రైవేట్ రంగంలో కార్మికుల పరిస్థితులు దిగజారుతున్నందుకు నిరసనగా ఈ సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. గత సంవత్సరం సమర్పించిన 17 డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి.

స్కూల్స్, బ్యాంకులకు సెలవు ఉందా?

స్కూల్స్, కాలేజీలకు అధికారికంగా సెలవు లేదు. అయితే రవాణా అంతరాయాలు, స్థానిక నిరసనల కారణంగా స్కూల్స్ కాలేజీల నిర్వహణ ప్రభావితం కావచ్చు లేదా మూసివేసే ఛాన్స్ ఉంది. తల్లిదండ్రులు ,విద్యార్థులు స్థానిక ప్రకటనలు ,తమ విద్యాసంస్థల నుంచి వచ్చే సమాచారంతో తో సెలవులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. 

దేశ వ్యాప్త సమ్మె కారణంగా RBI ఎలాంటి సెలవు ప్రకటించలేదు. బ్యాంకులు అధికారికంగా మూసివేయబడవు. అయితే బ్యాంకింగ్ రంగంలోని యూనియన్లు బంద్‌కు మద్దతివ్వడం, సమ్మెలో పాల్గొనే అవకాశం ఉన్నందున బ్యాంకింగ్ సేవలకు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అంతరాయం కలగవచ్చు. శాఖల కార్యకలాపాలు, చెక్కుల క్లియరెన్స్, కస్టమర్ సేవలు ప్రభావితం కావచ్చు. ఆన్‌లైన్ ,డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి.

మొత్తంగా బంద్ ప్రభావం:

దాదాపు 25 కోట్లకు పైగా కార్మికులు దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకింగ్, బీమా, పోస్టల్, బొగ్గు గనులు, పరిశ్రమలు, రాష్ట్ర రవాణా సేవలు ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి. అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం ఉండదు. స్టాక్ మార్కెట్లు యథావిధిగా పనిచేయనున్నాయి. 

ఏవి మూసివేయబడతాయి?

  • బ్యాంకింగ్ సేవలు
  • భీమా సంస్థల పని
  • తపాలా కార్యాలయం
  • బొగ్గు గనుల పని
  • రాష్ట్ర రవాణా సేవలు (ప్రభుత్వ బస్సులు)
  • రహదారి మరియు నిర్మాణ పనులు
  • ప్రభుత్వ కర్మాగారాలు ,కంపెనీల ఉత్పత్తి 

ఏవి తెరుచి ఉంటాయి..

  • చాలా ప్రైవేట్ రంగ కంపెనీలు పని చేస్తాయి
  • ఆసుపత్రి, వైద్య అత్యవసర సేవలు సాధారణంగా ఉంటాయి. 
  • ఆన్‌లైన్ సేవలు ఉంటాయని అంచనా