పంద్రాగస్టున లాంచ్ కానున్న కోవ్యాక్సిన్?

పంద్రాగస్టున లాంచ్ కానున్న కోవ్యాక్సిన్?

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తీసుకురావడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) కలసి ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పరిశోధనలో భాగంగా ఈ రెండు సంస్థలూ కలసి కరోనాకు విరుగుడును సాధ్యమైనంత త్వరగా తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. కోవ్యాక్సిన్‌ (బీబీవీ152 కొవిడ్ వ్యాక్సిన్)ను మహమ్మారికి విరుగుడుగా ఐసీఎంఆర్, బీబీఐఎల్ సంయుక్తంగా డెవలప్ చేస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన మరో అప్‌డేట్ తెలిసింది. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్‌‌లు ఆగస్టు 15న కోవ్యాక్సిన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిసింది. క్లినికల్ ట్రయల్స్ తర్వాత పంద్రాగస్టు నాడు కోవ్యాక్సిన్‌ను లాంచ్ చేస్తారని సమాచారం.

కోవ్యాక్సిన్‌ ట్రయల్స్ కోసం 12 ఇన్‌స్టిట్యూట్స్‌ను ఐసీఎంఆర్ ఎంపిక చేసిందని గురువారం ఓ అధికారి తెలిపారు. సెలెక్ట్ చేసిన ఇన్‌స్టిట్యూట్స్‌కు పంపిన లెటర్‌‌లో వ్యాక్సిన్ లాంచింగ్ గురించి ఐసీఎంఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. పబ్లిక్ హెల్త్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్‌ను త్వరగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆగస్టు 15న లాంచ్ చేయనున్నట్లు సదరు లెటర్‌‌లో ఐసీఎంఆర్ పేర్కొన్నట్లు సమాచారం. టాప్‌ మోస్ట్ ప్రయారిటీ కింద వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్స్‌ను గవర్నమెంట్ అఫీషియల్స్ పర్యవేక్షిస్తున్నారని.. క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేయాలని సెలెక్టెడ్ ఇన్‌స్టిట్యూట్స్‌కు ఐసీఎంఆర్ ఆదేశించిందని తెలిసింది. బీబీఎంఆర్, ఐసీఎంఆర్ ఎంతగా యత్నిస్తున్నప్పటికీ నిర్దిష్ట తేదీకి వ్యాక్సిన్ అందుబాటులోకి  రావాలంటే ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌ ట్రయల్స్‌ను స్పీడప్ చేయడం కీలకం కానుంది. భారత్ బయోటెక్ సంస్థ హైదరాబాద్ బేస్డ్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.