
న్యూఢిల్లీ: జీఎస్కే, పాత్, ఇతర కంపెనీలు అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ 'ఆర్టీఎస్, ఎస్' ధరను 2028 నాటికి సగానికి పైగా తగ్గిస్తామని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జీఎస్కే బుధవారం తెలిపాయి. ధర ఐదు డాలర్ల కంటే తక్కువగా ఉండేలా చూస్తామని తెలిపాయి. దీనివల్ల లక్షలాది మందికి మేలు జరుగుతుందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు.
జీఎస్కే చీఫ్ గ్లోబల్ హెల్త్ ఆఫీసర్ థామస్ బ్రూయర్ మాట్లాడుతూ, మలేరియాను నియంత్రించాలన్న ఉమ్మడి లక్ష్యంతో తమ కంపెనీ 2021లో భారత్ బయోటెక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుందని అన్నారు. 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన మొదటి మలేరియా వ్యాక్సిన్ ఆర్టీఎస్, ఎస్. అప్పటి నుంచి టీకా ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి భారీగా పెట్టుబడులు పెట్టామని, భారత్‌బయోటెక్‌కు టెక్నాలజీని బదిలీ చేశామని జీఎస్కే వెల్లడించింది.