రాహుల్ యాత్రలో సోనియాగాంధీ

రాహుల్ యాత్రలో సోనియాగాంధీ

రాహుల్ గాంధీ కర్ణాటకలో నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో సోనియాగాంధీ కూడా పాల్గొన్నారు. ఉదయం 6.30 గంటలకు మాండ్య జిల్లా జకన్నహళ్లి పట్టణ పరిధిలోని పాండవపుర తాలూకాలో ప్రారంభమైన యాత్రలో ఆమె కూడా భాగమయ్యారు. త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను మరింత బలోపేతం చేసేందుకే పాదయాత్రలో సోనియా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ వెంట కర్ణాటక మహిళా ఎమ్మెల్యేలు అంజలీ నింబాల్కర్, రూపకళ, లక్ష్మి హెబ్బాల్కర్ ఉన్నారు. ఈ యాత్ర సందర్భంగా సోనియాగాంధీకి షూ లేస్ ను స్వయంగా కొడుకు రాహుల్ గాంధీ కట్టారు.  దీనికి సంబంధించిన ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇవాళ పాదయాత్రలో భాగంగా బ్రహ్మదేవరహళ్లి గ్రామంలో నిర్వహించనున్న సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు..

సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 21 రోజులపాటు 511 కిలోమీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. ఇప్పుడు కర్ణాటకలో పాదయాత్ర కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా చేపట్టిన రాహుల్ పాదయాత్ర సుదీర్ఘంగా ఐదు నెలలపాటు కొనసాగనుంది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా మొత్తం 3750 కిలోమీటర్లు సాగి జమ్మూ కశ్మీర్ లో యాత్ర ముగియనుంది.