కూకట్‌పల్లి, వెలుగు: ‘మా దారి మా హక్కు’ నినాదంతో కూకట్‌పల్లి పరిధిలోని భరత్‌నగర్ కాలనీ ప్రజలు మరోసారి ఆందోళన చేపట్టారు. తమ కాలనీకి రాకపోకలకు అంతరాయం లేకుండా రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ముంబయి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారం క్రితం ఇదే అంశంపై ధర్నా చేసినా అధికారులు స్పందించకపోవడంతో మళ్లీ నిరసనకు దిగారు. 1978లో హౌసింగ్ బోర్డు లేఅవుట్‌లో చూపిన అన్ని రోడ్డు మార్గాలను అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు.
కాలనీ రోడ్లను పరిమితం చేయడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్లకార్డుల ద్వారా తెలియజేశారు. ఇప్పటికైనా అన్ని రోడ్లను పునరుద్ధరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.నాగిరెడ్డి, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, దీక్షిత్‌బాబు, వెంకటేశ్‌గౌడ్, రత్నారావు, వెంకటరత్నం, బుచ్చిబాబు పాల్గొన్నారు.
