Bharati Ghattamaneni: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ వచ్చేస్తోందోచ్..!

Bharati Ghattamaneni: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ వచ్చేస్తోందోచ్..!

ప్రిన్స్ మహేష్ బాబు ఇంటి నుంచి హీరోయిన్గా పదహారణాల తెలుగింటి అమ్మాయి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తోంది. అమర శిల్పి జక్కన్న చెక్కిన శిల్పంలా, బాపు బొమ్మలా ఉన్న ఈ అమ్మాయి మరెవరో కాదు. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని. ఇన్ స్టాగ్రాంలో యాక్టివ్గా ఉండే ఈ అమ్మాయి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలిసింది. దర్శకుడు తేజ ఈ క్రేజీ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా సబ్జెక్ట్ ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు మహేష్ బాబు, రమేష్ బాబు కుటుంబాల గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలో మాస్ సాంగ్గా మోతమోగిన ‘కుర్చీ మడతబెట్టి’ పాటకు ఇన్ స్టా రీల్ చేసి భారతి ఘట్టమనేని వైరల్ అయింది. తేజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరో, హీరోయిన్లు ఇండస్ట్రీలో సక్సెస్ను రుచి చూసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ తేజ సినిమాలతోనే కాజల్ అగర్వాల్, సదా, రీమా సేన్ హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఉదయ్ కిరణ్, నితిన్, ఆది పినిశెట్టి కూడా తేజ సినిమాలతోనే హీరోలయ్యారు. సో.. అలాంటి తేజ డైరెక్టర్గా చేస్తున్న సినిమాతో భారతి ఘట్టమనేని హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

అయితే.. ఈ సినిమాలో హీరో ఎవరనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు. లవర్ బాయ్గా ఫిట్ అయ్యే ఒక డెబ్యూ యాక్టర్ను హీరోగా తీసుకోవాలని తేజ అన్వేషణ సాగిస్తున్నట్లు తెలిసింది. రమేష్ బాబు కుటుంబానికి మహేష్ బాబు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఆశీస్సులతోనే రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

రమేష్ బాబు చనిపోయాక మహేష్ బాబు ఆయన కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచాడు. మహేష్ బాబు సొంత అన్నయ్య కొడుకు, కూతురు.. ఇద్దరూ సినీ రంగ ప్రవేశం చేస్తుండటంతో టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ తేజ ప్రస్తుతం తన కొడుకును హీరోగా పెట్టి ఒక సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ జానర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అన్న కూతురు భారతి హీరోయిన్గా తేజ సినిమా మొదలుకానుంది.