న్యూఢిల్లీ: సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ అమ్మబోయే మిగిలిన 3.33శాతం వాటా కొనడానికి భారతీ ఎయిర్‌టెల్ ప్రమోటర్ కంపెనీ భారతి టెలికాం (బీటీఎల్) నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీలు) ద్వారా రూ.6,000 కోట్ల వరకు సేకరించనుంది. ఇవి రూపాయి- లింక్డ్ ఎన్సీడీలని కంపెనీ వర్గాలు తెలిపాయి. వీటికి ప్రధానంగా ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) సబ్‌స్క్రయిబ్ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. కొంతమంది స్థానిక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కూడా ఎన్సీడీలను కొనే అవకాశాలు ఉన్నాయి. పోయినవారం ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్ 1.76శాతం వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా రూ.7,100 కోట్లకు అమ్మింది.
ఆ వాటాలో దాదాపు 1.62శాతం - బీటీఎల్ రూ.6,604 కోట్లకు కొన్నది. మిగిలిన (0.14శాతం) వాటా ఎయిర్‌టెల్‌లోని పబ్లిక్ షేర్‌హోల్డర్లు తీసుకున్నారు. బీటీఎల్ ఇప్పుడు సింగ్‌టెల్ నుండి మిగిలిన వాటా కొనుగోలుకు డబ్బు వేటలో పడింది. బీఎన్పీ పరిబాస్, హెచ్ఎస్బీసీ, జపాన్‌కు చెందిన ఎంయూఎఫ్‌జీ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లు రూపాయి ఎన్సీడీల ద్వారా డబ్బును సేకరించేందుకు బీటీఎల్కు సహాయపడే అవకాశం ఉంది.
