
హైదరాబాద్, వెలుగు: కార్మికుల హక్కులను బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కాలరాస్తున్నా యని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సకల జనుల సమ్మె చేసి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు.. తొమ్మిదన్నరేండ్లుగా కనీస వేతన బోర్డుపై సమీక్ష చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ (కేకేసీ– కామ్‌గార్, కర్మాచార్ కాంగ్రెస్) సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేకేసీ ఆలిండియా చైర్మన్ డాక్టర్ ఉదిత్ రాజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా ఔట్ సోర్సింగ్ విధానంతో ప్రభుత్వం శ్రమదోపిడీకి పాల్పడుతున్నదని ఫైర్ అయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ తెచ్చిన 10 వేల కోట్ల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తున్నదని ఆరోపించారు. కౌశల్ సమీర్ కేకేసీ రాష్ట్ర చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఉదిత్ రాజ్, మాణిక్ రావ్ ఠాక్రే, షబ్బీర్ అలీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. మరోవైపు మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘం అనుబంధ విభాగం ఐఎన్టీయూసీ నేతలు గొడవకు దిగారు.