చాలెంజ్​గా ఆర్థిక శాఖ తీస్కున్న : భట్టి విక్రమార్క

చాలెంజ్​గా ఆర్థిక శాఖ తీస్కున్న : భట్టి విక్రమార్క
  • ఆర్థిక శాఖ ఆఫీసర్లతో మీటింగ్ లో భట్టి విక్రమార్క
  • రాష్ట్రం రూ. 5.50 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని తెలుసు 
  • 6 గ్యారంటీలు, మేనిఫెస్టో అమలుకు ఆదాయం పెంచాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నదని.. అయినప్పటికీ చాలెంజ్ గా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచేలా అధికారులు పని చేయాలన్నారు. శనివారం సెక్రటేరియెట్​లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. మొదటి మీటింగ్ సందర్భంగా అధికారులను పరిచయం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు కేవలం ఉద్యోగస్తులమని భావించకుండా, రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. సంపదను సృష్టించడం, ప్రజలకు పంచడం, ఆదాయ వనరుల అన్వేషణ కోసం అధికారులు తమ మేధస్సును ఉపయోగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖపైనే ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రకరకాల సమస్యలతో సతమతం అవుతున్నారని తన పాదయాత్రలో తెలుసుకున్నట్లు చెప్పారు. ఇండ్లు లేక, ఉద్యోగాలు లేక

పేదరికం కారణంగా చదువుకోలేని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారన్నారు. పథకాలను ఉచితాలుగా చూడాల్సిన అవసరం లేదని.. మానవ వనరులపై పెట్టుబడిగా భావించాలన్నారు. సమావేశానికి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, సెక్రటరీ టీకే శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్. రవి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.