రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగు తున్నది. 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. ఏడు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 10 డిగ్రీలు, అంతకన్నా తక్కువ టెంపరేచర్లు రికార్డయ్యాయి. శుక్రవారం రాత్రి 4 జిల్లాల్లో 6 డిగ్రీల రేంజ్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్/ శ్రీనగర్, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. ఏడు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 10 డిగ్రీలు, అంతకన్నా తక్కువ టెంపరేచర్లు రికార్డయ్యాయి. శుక్రవారం రాత్రి 4 జిల్లాల్లో 6 డిగ్రీల రేంజ్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 6.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.8, వికారాబాద్ జిల్లా నవాబ్‌పేటలో 6.9 డిగ్రీల మేర నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి)లో 7.3 డిగ్రీలు రికార్డయింది. 6 జిల్లాల్లో 8 డిగ్రీలు, 7 జిల్లాల్లో 9 డిగ్రీల రేంజ్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక 8 జిల్లాల్లో 10, మరో 7 జిల్లాల్లో 11 డిగ్రీల రేంజ్‌లో నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ 4 చోట్ల సింగిల్ డిజిట్‌లోనే ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. హెచ్‌సీయూ వద్ద 7.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మౌలాలిలో 8.3 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.1, శివరాంపల్లిలో 9.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది.
పుల్వామాలో మైనస్ 4 డిగ్రీలు
కాశ్మీర్‌లో చలి తీవ్రమైంది. చాలా ప్రాంతాలలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి.. గడ్డకట్టే స్థాయి కంటే దిగువకు చేరాయని వాతారణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి పుల్వామా పట్టణంలో అత్యల్పంగా మైనస్ 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వారు చెప్పారు.
అలాగే, శ్రీనగర్‌లో అత్యల్పంగా మైనస్ 2.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్అయిందని, ఇది అంతకు ముందు రాత్రి నమోదైన 0.2 డిగ్రీల సెల్సియస్ కంటే రెండు డిగ్రీలు తక్కువ అని అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీనగర్‌తో పాటు కాశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసిందని తెలిపారు.
