కరీంనగర్ లో స్మార్ట్ సిటీ పనులకు డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ 10 రోజులే

కరీంనగర్ లో స్మార్ట్ సిటీ పనులకు డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ 10 రోజులే
  •  అసంపూర్తిగానే కశ్మీర్ గడ్డ మార్కెట్, బాల సదన్, డిజిటల్ లైబ్రరీ పనులు
  •  డిసెంబర్ 31తో ముగియనున్న తుది గడువు 
  •  కాంట్రాక్టర్లు, ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే పనులు లేట్‌‌‌‌‌‌‌‌ 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో స్మార్ట్ సిటీ పనుల పూర్తికి డెడ్ లైన్ ముంచుకొస్తుంది. ఇప్పటికే పలుమార్లు పెంచుతూ వస్తున్న గడువు మరో 10 రోజుల్లో(డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31) ముగియనుంది. అయినా సిటీలో చేపట్టిన పలు పనులు ఇంకా తుది దశకు చేరుకోలేదు. పనులు సాగుతున్న తీరు చూస్తే గడువులోగా పూర్తి చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఆఫీసర్ల పట్టింపులేనితనంతో గడువుమీద గడువు పెంచినా పనులు కంప్లీట్ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 10 రోజుల తర్వాత మరోసారి గడువు పెంచుతారా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. 

పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పనులివే..   

గ్రేటర్ వరంగల్, కరీంనగర్ సిటీల్లో పెండింగ్​లో ఉన్న స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు  చివరి అవకాశమిచ్చింది. గతంలో 2024 మార్చి 31తో ముగిసిన గడువును రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో పొడగించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో రూ.979 కోట్లతో 49 పనులు పూర్తయినప్పటికీ.. రూ.115 కోట్ల విలువ చేసే 12 పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. 

 వీటిలో రూ.26 కోట్లతో చేపట్టాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రూ.38 కోట్లతో టవర్ సర్కిల్ ఎలివేషన్, కలర్ ఫుల్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కేబుల్ బ్రిడ్జి సమీపంలో రూ.16 కోట్ల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కశ్మీర్ గడ్డ వద్ద రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రూ.7 కోట్లతో డిజిటల్ లైబ్రరీ, రూ.8 కోట్లతో గవర్నమెంట్ స్కూళ్లలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ క్లాస్ రూమ్స్, రూ.2 కోట్ల బాలసదనం వర్క్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం పిట్స్ ఉన్నాయి. రెండు నెలలుగా ఈ పనుల్లో వేగం పెంచినప్పటికీ.. ఇంకా పూర్తి చేయలేకపోయారు. రూ.26 కోట్ల విలువైన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్, ట్రాఫిక్ కంట్రోల్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టేషన్, మొబిలిటీ రెగ్యులేటరీ వంటి పనులు మొదలే పెట్టలేదు. 

మరోసారి గడువు పెంచమని కోరాం.. 

స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టిన అభివృద్ధి పనులపై శుక్రవారం కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ, స్మార్ట్ సిటీ మిషన్ నేషనల్ మిషన్ డైరెక్టర్ తో వర్చువల్ మీటింగ్ జరిగింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ప్రజెంటేషన్ ఇచ్చాం. పెండింగ్ వర్క్స్ సగానికిపైగా పూర్తయిన దృష్ట్యా మరో అవకాశమివ్వాలని కోరాం. గడువు పెంచుతారనే భావిస్తున్నాం.-ప్రఫుల్ దేశాయ్, కమిషనర్, కరీంనగర్ బల్దియా