భవిష్యత్ లో క్రీడా హబ్ గా తెలంగాణ : మంత్రి వాకిటి శ్రీహరి

భవిష్యత్ లో క్రీడా హబ్ గా తెలంగాణ :  మంత్రి వాకిటి శ్రీహరి
  • యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ ముగింపు వేడుకల్లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, కొత్త స్పోర్ట్స్ పాలసీ ద్వారా రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్​లో గోల్డ్ మెడల్స్ సాధించేలా కృషి చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. భవిష్యత్​లో తెలంగాణ క్రీడా హబ్‌గా మారబోతుందన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ ముగింపు వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

 వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఈ పోటీల్లో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. సీఎం కప్ ద్వారా ఇప్పటికే 4 లక్షల మంది గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీశామని, రాబోయే రోజుల్లో మరో 5 లక్షల మందిని గుర్తించి అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కొత్త స్టేడియాల ఏర్పాటుతో పాటు పాతవాటిని ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.