- ఈవీ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగంలో హైదరాబాద్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సిటీలోని ఓ హోటల్‌లో ఈవీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ..ఈవీలను ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు లక్షా 59 వేల 304 వాహనాలకు రూ.806.35 కోట్ల రాయితీలు అందిం చామని వెల్లడించారు.
ఈవీ ట్యాక్స్ రాయితీల కింద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 800 కోట్ల నష్టాన్ని భరిస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. విజన్ 2047 లక్ష్యంగా జీరో ఉద్గారాలను సాధించేందుకు తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని వెల్లడించారు. కాగా..వచ్చే నెలలో నిర్వహించనున్న రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమంపై చర్చించేందుకు రవాణా మంత్రి పొన్నం శనివారం ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
