చారిత్రక హైదరాబాద్ మూసీ నది వారసత్వంపై ప్రదర్శన

చారిత్రక హైదరాబాద్ మూసీ నది వారసత్వంపై  ప్రదర్శన

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  చారిత్రక హైదరాబాద్​ నగరం, మూసీ నది వారసత్వంపై గీతం యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఫొటో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దక్కన్​ ఆర్కైవ్స్​ సహకారంతో గీతం స్కూల్​ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్​ సైన్సెస్​ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. చారిత్రక పత్రాలు, ఛాయాచిత్రాలు, హైదరాబాద్​ మహా నగర మ్యాపులు, కొన్ని అరుదైన ఆర్కైవల్​ మెటీరియల్​ను ప్రదర్శనలో పొందుపరిచారు. మూసీ నదితో హైదరాబాద్​కు ఉన్న దీర్ఘకాలిక, సంక్లిష్టమైన సంబంధాలను ఆకర్షనీయమైన కథనాలతో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. 

పర్యావరణ స్థితి స్థాపన, చారిత్రక జ్ఞాపకాలను కాపాడుకోవాల్సిన అవశ్యకతను ఈ కార్యక్రమం నొక్కి చెప్పిందని వీసీ డీఎస్​ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తెలిపారు. చరిత్ర ఔత్సాహికులు, హైదరాబాద్​ గుర్తింపును అర్ధం చేసుకోవాలనుకునే వారికి, విద్యార్థులకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడుతాయని పేర్కొన్నారు. అనంతరం జీఎస్​హెచ్​ఎస్​లోని లలిత కళల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగు ప్రదర్శనను వీసీ ప్రారంభించి, తిలకించారు. కోర్సు ఫలితాల ప్రదర్శనను ఆయన అభినందించారు.