- గ్రామపంచాయతీ ఆఫీస్‌లకు కలరింగ్, రిపేర్ పనులు
మహబూబాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు ఈ నెల 22న కొలువుదీరనున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ బిల్డింగ్‌లకు రిపేర్లు, క్లీనింగ్ పనులు చేపట్టారు. కొత్త పాలకవర్గాలు కొలువు తీరేందుకు ప్రభుత్వం ఎలాంటి ఫండ్‌ను కేటాయించనప్పటికీ.. గ్రామపంచాయతీలోని జనరల్ ఫండ్స్ ద్వారా బిల్డింగ్‌లకు రంగులు వేయడం, కిటికీలు, డోర్లకు, ఫ్యాన్లు, లైట్ల రిపేర్ పనులను చేపడుతున్నారు.
కొన్ని చోట్ల కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తమకు అనుగుణంగా వాస్తు మార్పులు సైతం చేయించుకుంటున్నారు. వాస్తు మార్పుల్లో భాగంగా భవనాల కిటికీలు, దర్వాజలను సొంత ఖర్చులతో మార్చుకుంటున్నారు. రెండేండ్లుగా పాలకవర్గం లేక నిరాదరణకు గురైన పంచాయతీ బిల్డింగ్‌లు ప్రస్తుతం కొత్త హంగులను సంతరించుకుంటున్నాయి. మరో వైపు ఇప్పటివరకు అరకొరగా చేపట్టిన శానిటేషన్ పనులను సిబ్బంది స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రతీ వీధిని క్లీన్ చేయడంతో పాటు వీధుల వెంట మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నారు.
ప్రమాణ స్వీకార బాధ్యత స్పెషల్ ఆఫీసర్లదే...
గ్రామపంచాయతీలో నూతన కమిటీల ప్రమాణ స్వీకార బాధ్యతను ఆయా గ్రామాల స్పెషల్ ఆఫీసర్లకే అప్పగించారు. గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఎంఈవోలు, ఏఈలు, వెటర్నరీ డాక్టర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లు, టీచర్లు, ఇతర శాఖల ఆఫీసర్లు కొనసాగుతున్నారు. ఒక్కొక్కరు రెండు మూడు గ్రామాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నప్పటికీ... వారి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
