జన్నారం, వెలుగు: జన్నారం మండల కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన కనికరపు ప్రభంజనం శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
గతంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రెసిడెంట్‌గా పని చేసిన ప్రభంజనం మావోయిస్టులకు సహకరిస్తూ అర్బన్ మావోయిస్టు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారని డీజీపీ ప్రకటించడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రభంజనం మావోయిస్టులు సహకరిస్తున్నా రనే విషయం ఇక్కడి ప్రజలకు తెలియకపోవడమే ఇందుకు కారణం. ఏకంగా 41 మంది మావోయిస్టులతో కలిసి ప్రభంజనం శుక్రవారం లొంగిపోవడంలో మండల ప్రజలతా ఆశ్చర్యానికి గురయ్యారు.
మూడు రోజుల క్రితమే అదుపులోకి...
మావోయిస్టులకు సహకరిస్తూ చందాలు వసూలు చేస్తున్నారని గత మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన స్పెషల్ పోలీసులు జన్నారానికి వచ్చి గాంధీనగర్ లోని ఆయన ఇంట్లో ప్రభంజనంను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్థానిక పోలీసులకు తెలియకుండానే ప్రభంజనంను తీసుకెళ్లి విచారించిన అనంతరం మరి కొంతమంది మావోయిస్టులతో కలిపి డీజీపీ ఎదుట హాజరుపరిచారు.
