ఆదిలాబాద్ టౌన్, వెలుగు: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్’ పోస్టర్లను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు బాహ్య ప్రపంచానికి తెలియని గమ్యస్థానాలను కనుగొనడం, ప్రకృతి, వన్యప్రాణి, ఆర్ట్, కల్చర్, హెరిటేజ్, వాటర్, రూరల్ ఏరియాలో బస, ఆధ్యాత్మికత, అడ్వెంచర్ వంటి అంశాలపై 3 ఫొటోలు సమర్పించాలన్నారు.
కనెక్టివిటీ, దూరం, రవాణా, గూగుల్ లొకేషన్, 100 పదాలతో ప్రదేశం, సందర్శించిన సమయం, బస, బడ్జెట్, సేఫ్టీ గురించి వివరణను 60 సెకన్ల వీడియోలో పొందుపరచాలన్నారు. ఆసక్తిగల వారు జనవరి 5లోగా సమర్పించాలని, గెలుపొందిన వారి వివరాలు సంక్రాంతి పండుగ రోజు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
మొదటి విజేతకు రూ.50 వేలు, రెండో విజేతకు రూ.30 వేలు-, థర్డ్వచ్చినవారికి రూ.20 వేలతోపాటు మరో 10 మందికి కన్సొలేషన్ బహుమతులు అందజేస్తామని తెలిపారు. 2 రోజులు ఉచితంగా హరిత హోటల్స్‌లో బస సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా పర్యాటక శాఖ అధికారి రవికుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
