భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రణాళికలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. సింగపూర్‌కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈ మెగా ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దుతున్నది. మొత్తం 30 వేల ఎకరాల విస్తీర్ణంలో.. అత్యాధునిక నగరంగా దీనిని తీర్చిదిద్దేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నది. ఇందులో 15 వేల ఎకరాలను కోర్ సిటీ డెవలప్‌మెంట్‌కు, మరో 15 వేల ఎకరాల ఫారెస్ట్‌ను అర్బన్ ఫారెస్ట్ యాక్టివిటీస్‌కు కేటాయించారు.
ముచ్చర్ల సెంట్రల్ పాయింట్.. స్కై స్క్రాపర్లతో ‘ఏఐ సిటీ’..
ఫ్యూచర్ సిటీకి గుండెకాయలాంటి ముచ్చర్ల ప్రాంతంలో గతంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లోనే ప్రధాన ‘ఏఐ సిటీ’ని ప్రతిపాదించారు. న్యూయార్క్, దుబాయ్ తరహాలో ఆకాశహర్మ్యాలు , ఐటీ టవర్లు, కార్పొరేట్ ఆఫీసులన్నీ ఈ ముచ్చర్ల కోర్ ఏరియాలోనే రానున్నాయి. ఎత్తైన గుట్టలు, రాళ్లతో కూడిన ఈ ప్రాంతం ఎత్తైన భవనాల నిర్మాణానికి అత్యంత అనుకూలమని నిపుణులు తేల్చారు. అమెజాన్, గూగుల్‌లాంటి డేటా సెంటర్లన్నీ ఈ సెంట్రల్ హబ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ప్రధాన 300 అడుగుల రోడ్డు నేరుగా ఈ ఏఐ సిటీని తాకుతుంది.
అంటే.. ఫ్యూచర్ సిటీలోకి ఎంటర్ అవ్వగానే కనిపించే ఐకానిక్ జోన్ ఇదే ఉండనున్నట్లు తెలుస్తున్నది. కాలుష్యానికి తావులేని ‘గ్రీన్ ఫార్మా’ కంపెనీలకు, డేటా సెంటర్లకు ప్రత్యేక క్లస్టర్లను కేటాయించారు. ఇవి రెసిడెన్షియల్ జోన్‌కు నిర్ణీత దూరంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫార్మా సిటీ అంటే కాలుష్యం అనే అపోహను చెరిపేస్తూ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంతో నడిచే కంపెనీలకే ఇక్కడ అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు ఏఐసిటీ కోసం భారీ స్కై స్క్రాపర్లతో కూడిన ఐటీ టవర్లను డిజైన్ చేశారు. నాలెడ్జ్ అండ్ స్కిల్ వ్యాలీ ముచ్చర్లకు ఆనుకొని ఉన్న మీర్‌ఖాన్ పేట ప్రాంతాన్ని ‘ఎడ్యుకేషన్ హబ్’గా తీర్చిదిద్దే ప్లాన్ ఖరారైంది. ఇప్పటికే ఇక్కడ ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి శంకుస్థాపన చేశారు. దీనికి చుట్టుపక్కల ఉన్న సువిశాలమైన స్థలాల్లోనే అంతర్జాతీయ యూనివర్సిటీల క్యాంపస్‌లు రాబోతున్నాయి. ఇక్కడ ఉండే సహజమైన చెరువులను అలాగే ఉంచుతూ, వాటి ఒడ్డున లైబ్రరీలు, రీసెర్చ్ సెంటర్లు వచ్చేలా డిజైన్ చేస్తున్నారు.
