Rajinikanth: నటుడు శ్రీనివాసన్ మృతితో రజనీకాంత్ షాక్.. “నా స్నేహితుడు ఇక లేడంటూ” భావోద్వేగం

Rajinikanth: నటుడు శ్రీనివాసన్ మృతితో రజనీకాంత్ షాక్.. “నా స్నేహితుడు ఇక లేడంటూ” భావోద్వేగం

మలయాళ లెజండరీ యాక్టర్, డైరెక్టర్ శ్రీనివాసన్ (Sreenivasan) ఇవాళ కన్నుమూశారు. శ్రీనివాసన్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ 20, 2025న కొచ్చిలోని త్రిప్పునితరలో మరణించారు. శ్రీనివాసన్ వయస్సు 69 సంవత్సరాలు. దాదాపు 5 దశాబ్దాల అద్భుతమైన సినీ కెరీర్‌లో, శ్రీనివాసన్ మలయాళ సినిమాపై చెరగని ముద్ర వేశారు. తన చురుకైన హాస్యం, సామాజిక వ్యంగ్యం మరియు లోతైన మానవీయ పాత్రలతో ఎంతో గుర్తింపు పొందారు.

ఆయన మృతిపట్ల మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీపెద్దలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో శ్రీనివాసన్ మరణవార్త విని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఎమోషనల్ అయ్యారు. ఆయనతో రజినీకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

“నాకు ఉన్న మిత్రుల్లో మంచి స్నేహితుడు శ్రీనివాసన్. సమాజంలో కూడా చాలా మంచి మనిషి. సినిమాలలో ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. అతను ఇక లేడని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. అతను నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో నా క్లాస్‌మేట్. ఆ తర్వాతఒక అద్భుతమైన నటుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఎంతో గుర్తింపు పొందారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి" అని రజనీకాంత్ అన్నారు.

మలయాళ యాక్టర్, డైరెక్టర్ పృథ్వీరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సంతాపం ప్రకటించారు. “ఎప్పటికప్పుడు తన వినూత్నమైన టాలెంట్ తో ప్రేక్షకులను అలరించే గొప్ప రచయిత/దర్శకుడు/నటుడికి ఇదే నా తుది వీడ్కోలు! తనదైన పాత్రలతో ఎంతోమందిని నవ్వించారు. ఎన్నో సామాజిక చిత్రాలను డైరెక్ట్ చేసి ఆలోచింపజేశారు. అందుకు మీకు ఎప్పటికీ ధన్యవాదాలు! లెజెండ్ని మిస్ అవుతున్నాం!” అని పృథ్వీరాజ్ ట్వీట్ చేశారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత సౌండ్ డిజైనర్ రెసుల్ పూకుట్టి ఎమోషనల్ ట్వీట్ చేశారు “మేము ఎప్పటికీ మరచిపోలేని ముఖం. మేము ఎప్పటికీ విని అలసిపోని గొంతు. మీరు వదిలి వెళ్ళిన ఈ శూన్యం ఎప్పటికీ పూరించబడదు. నిరంతరం మాతో మాట్లాడానికి చూపించిన “భిన్నమైన” ప్రపంచాన్ని, మాకు వినిపించిన కొత్త స్వరాన్ని కోల్పోవడం ఎంతో బాధాకరం #RIPSreenivasan" అని ఎమోషనల్ అయ్యారు

ALSO READ : నెట్‌ఫ్లిక్స్‌లో ఆంధ్రా కింగ్ తాలూకా..

ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మలయాళ సినిమాకు చెందిన గొప్ప నటుడు, రచయిత శ్రీనివాసన్ గారి మరణం పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని ఎమోషనల్ ట్వీట్ చేసింది.

శ్రీనివాసన్‌కి అతని భార్య విమల మరియు ఇద్దరు కుమారులు. అందులో ఒకరు ప్రముఖ దర్శకుడు, నటుడు మరియు గాయకుడిగా వినీత్ శ్రీనివాసన్ రాణిస్తున్నారు. మరో కుమారుడు, ప్రముఖ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ ఉన్నారు.