గాంధీ పేరు మర్చిపోయేలా చేయడానికి కేంద్రం కుట్ర చేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం చట్టంలో గాంధీ పేరు తొలిగింపుపై టీపీసీసీ నిరసనకు దిగింది. ఈ క్రమంలో డిసెంబర్ 20న హైదరాబాద్ ఎంజీ రోడ్ గాంధీ విగ్రహం దగ్గర పలువురు మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు . ఈ నిరసనలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉపాధీ హామీ స్కీం ను తెచ్చిందే కాంగ్రెస్ అన్నారు. కేంద్రం తీరుపై దేశ వ్యాప్తంగా నిరసనలు చేయాలన్నారు వివేక్.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్ఈజీఏ) స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్‌సభ డిసెంబర్ 18న ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి గాంధీ పేరును తొలగించడంపై కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు రెండు రోజులు నిరసనలు చేపట్టనుంది కాంగ్రెస్. రేపు ఆదివారం జిల్లాల్లో నిరసనలు చేపట్టనుంది కాంగ్రెస్.
