Telangana Tourism : కరీంనగర్ లో మొలంగూర్ కోట.. ఆ బావిలో నీరు తాగితే జబ్బులు పరార్..!

Telangana Tourism :   కరీంనగర్ లో మొలంగూర్ కోట..  ఆ బావిలో నీరు తాగితే జబ్బులు పరార్..!

చరిత్రకు, ప్రజల జీవనానికి, రాచరికపు వైభవానికి తెలంగాణలో సాక్ష్యాలు ఎన్నో..! కాకతీయులు, నిజాంల
పాలనలో వెలుగొందిన కోట. మొలంగూర్... నిజాం ప్రభువులు ప్రత్యేకంగా ఇక్కడున్న దూద్​ బావి నుంచే మంచినీళ్లు తెప్పించుకుని తాగేవారు. ఈ నీళ్ల ప్రత్యేకత ఏంటి? కోట గొప్పతనం ఏంటి? ఆ బావిలోని నీళ్లకు అంత రుచి ఎక్కడ నుంచి వచ్చింది? మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.. !

తెలంగాణలోని కరీంనగర్ అంటేనే కోటలకు, బురుజులకు, ఎన్నో కట్టడాలకు పేరున్న ప్రాంతం, అలాంటి కరీంనగర్ జిల్లా.. శంకరపట్నం మండలంలో ఉంది మొలంగూరు గ్రామం. ప్రజల ఆచార సంప్రదాయాలకు, అద్భుతమైన కోటకు సాక్ష్యం ఈ గ్రామం.

ఒకప్పుడు ఈ గ్రామాన్ని 'ముగదర్' అని పిలిచే వాళ్లు.. ఆ తర్వాత మలంగూరుగా మారింది. కొంతకాలంమంగ్ షా వలి అనే మహ్మదీయ రాజు పాలించేవాడు, ఆయన చనిపోయిన తర్వాత ఈ గుట్టకిందే ఆయన సమాధిని నిర్మించారు. మంగ్ షా వలి పేరుమీద మలంగూరుగా చూరింది. కాలక్రమంలో మొలంగూరు అని స్థిరపడింది.

కోట నిర్మాణం: ప్రాచీన కాలం నుంచి ఇక్కడ ప్రకృతి సిద్ధంగా గుట్ట ఉంది. 13వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడి సైన్యాధికారి అలిగిరి మహారాజ్ ఈ గుట్టను రాజధాని, గా చేసుకుని ఓరుగల్లును పాలించాడు. సుబేదార్ అనే వ్యక్తి ఈ కోటను నిర్మించి నట్లు చరిత్ర చెప్తుంది. ఈ కోట కరీంనగర్ కు 30కి.మీ దూరం .. వరంగల్ నుంచి 53కి.మీ అంటే ఎలగందుల, ఓరుగల్లు కోటలకు మధ్యలో ఉంది.

ఆనవాళ్లు ఎన్నో!:నేటికీ ఈ కోటపై కాకతీయులకు చెందిన ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. శత్రుదుర్చేద్య మైన ఈ కోట నుంచి ఓరుగల్లు వెళ్లడానికి ప్రత్యేకమైన రహస్య మార్గం  ఉండేది. అంతేకాదు ఈ కోటలో కూర్చొని తీర్పులు చెప్పడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకు న్నట్లు నిర్మాణాలను బట్టి తెలుస్తుంది. రాణి, రాజు కోసం ప్రత్యేకంగా కోనేర్లు ఉన్నాయి. ఈ కోట విభాగం చెట్లు చేమలతో నిండి ఉంది. అనాటి రాతి కట్టడాలు, బురుజులు, ఫిరంగులు అన్నీ పాడై పోయి పర్యాటకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ కోట పైకి చేరుకోడానికి కొంతదూరం రాతితో కూడిన మెట్లున్నాయి. తర్వాత ఎక్కాలంటే కష్టంతో కూడుకున్న పనే. కానీ, కోట పైభాగాన ఉన్న ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శ్రమపడి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా గుంపులు గుంపులుగా వెళ్లి స్వామికి పూజలు చేసి వస్తారు. 

ఎక్కడానికి భయపడే వాళ్లు, చివర వరకు వెళ్లకుండా నిరాశతో మధ్యలోనే వెనుతిరుగుతారు. ఇక్కడ రాతిదీపం ఉంది. ఈ దీపాన్ని  ఆనాటి రాజులూ వెలిగించే వాళ్లని... దూరానికి వెలుగు మిణుకు మిణుకు మంటూ కలిపించేదని అక్కడి వాళ్లు చెప్తారు. రాతి దీపానికి చెందిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి.

దూద్​ బావి: కోట ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఒక బావి ఉంది. దీనినే దూద్​ బౌలి" అని కూడా పిలుస్తారు. ఈ బావిలో నీళ్లు చాలా రుచిగా ఉంటాయి. పాలు, నీళ్లు కలిపిన రంగులో కనిపిస్తాయి అందుకే ఈ బావికి ఆపేరు పెట్టారు. ఈ నీళ్లు తాగితే రోగాలు రావని, ఒకవేళ ఏదైనా ఉంటే నయమవుతాయని అంటారు. ఎందుకంటే ఈ బావి నీళ్లలో ఔషద గుణాలు ఉన్నాయని నమ్ముతారు. నిజాం ప్రభువుల కోసం ఈ బావిలో నీళ్లను గుర్రాలపై ఇక్కడి నుంచి తీసువెళ్ళే వాళ్లని చరిత్రకారులు చెపుతారు.

 ఇప్పటికీ ఈ కోటలోకి వచ్చిన వాళ్లు ఈ బావి నీళ్లు తాగకుండా వెళ్లరు. ఈ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కలున్న ఆముదాల పల్లి, గడ్డపాక, కన్నాపూర్ మల్ల, రాజాపూర్ వంటి పలు గ్రామాల ప్రజలు తాగునీటికై ఈ బావిపైనే ఆధారపడుతున్నారు. ఈ బావి నీళ్లపై పరిశోధనలు కూడా జరిగాయి. నేటి మినరల్ వాటర్ కంపెనీలకు ఏ మాత్రం తీసిపోనంత రుచిగా ఈ బావి నీళ్లు ఉన్నాయని తేల్చారు. కారణం కూడా కనుగొన్నారు. వీటిలో ఖనిజలవణాల శాతం చాలా తక్కువగా ఉంచటం వల్లే అంత రుచిగా ఉన్నాయని చెప్పారు.

స్త్రీలకూ..: మొలంగూర్​ లో  కాకతీయులు. నిజాం ప్రభువుల కాలం నుంచి మత సామర స్యంతో కులాలకు అతీతంగా మొహరం పండుగను జరుపుకునే ఆచారం ఉండేది. నేటికీ ఇదే ఆచారాన్ని అక్కడి ప్రజలు కొనసాగిస్తున్నారు. ఎక్కడా లేని ఆచారం ఈ కోటలో మరొకటి కూడా ఉంది. అదేంటంటే మొహరం రోజు స్త్రీలను మలంగ్ షా వలి దర్గాలోకి అనుమతి ఇస్తారు. స్త్రీలు దీపం వెలిగించి ఈ వేడుకల లోసంతోషంగా పాల్గొంటారు. గుట్టకింద కూడా  జాతర  చేస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన మొలంగూరు కోటను పరిరక్షించు కోవాలి. పర్యాటక ప్రాంతంగా ప్రకటించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.