ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా కుబేరుడు, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఎప్టిన్ లీక్స్ కి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. అమెరికా న్యాయ శాఖ సుమారు 3 లక్షల పత్రాలను బహిర్గతం చేసింది. ఇందులో హాలీవుడ్ నటులు, రాజకీయ ప్రముఖులు, రాజకుటుంబీకుల ఫోటోలు ఉండటం అంతర్జాతీయంగా ప్రకంపనాలు సృష్టిస్తోంది.
బయటకు విడుదలైన 3,500 ఫైళ్లలో 2.5 GB కంటే ఎక్కువ ఫోటోలు, డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటిలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అమ్మాయిలతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు, పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్, హాలీవుడ్ నటులు క్రిస్ టక్కర్, కెవిన్ స్పేసీ, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, బిల్ క్లియర్సన్ వంటి ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోలు ఎక్కడ తీశారనే విషయంపై స్పష్టత లేదు. అయితే అర్థరాత్రి సమయంలో ఫైల్స్ బయటకు విడుదల చేయటం వెనుక చాలా విషయాలను దాయాలనే ప్రయత్నం ఉందని ఆరోపణలు కూడా దుమారాన్ని పెంచేస్తున్నాయి.
ALSO READ : ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య ఇద్దరికీ 17 ఏళ్ల జైలు
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల మేరకే ఈ ఫైళ్లు విడుదలయ్యాయి. అయితే విడుదలైన పత్రాల్లో ట్రంప్ పేరు కూడా ప్రస్తావనకు రావడం గమనార్హం. 1994లో ఒక 13 ఏళ్ల బాలికను ఎప్స్టీన్.. ట్రంప్ రిసార్ట్‌కు తీసుకువెళ్లాడని, అక్కడ ఎప్స్టీన్ జోక్ చేయగా ట్రంప్ నవ్వాడని ఒక బాధితురాలు ఆరోపించినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. అలాగే గతంలో మిస్ టీన్ యూఎస్ఏ పోటీల సమయంలో అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్న రూమ్‌లోకి ట్రంప్ అకస్మాత్తుగా ప్రవేశించేవారని కూడా పత్రాల్లో పేర్కొన్నారు.
ఈ పత్రాల విడుదలపై ఎప్స్టీన్ బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితమే మరియా ఫార్మర్ అనే బాధితురాలు ఎప్స్టీన్‌పై ఫిర్యాదు చేసినా.. ఎఫ్‌బీఐ పట్టించుకోలేదని ఆమె తరఫు న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన పత్రాల్లో కీలక పేర్లను దాచిపెట్టారని, ప్రభుత్వం తనను తాను రక్షించుకోవడానికే ప్రయత్నిస్తోందని బాధితురాలు లిసా ఫిలిప్స్ ఆరోపించారు. మరికొందరు బాధితులు స్పందిస్తూ.. ఇవి పాత ఫోటోలేనని, దోషులను రక్షించేందుకే ప్రభుత్వం ఇలా అసంపూర్ణ సమాచారాన్ని బయటపెట్టిందని విమర్శించారు.
రాజకీయ దుమారం: అటార్నీ జనరల్‌పై అభిశంసన?
ఈ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రోఖన్నా, అటార్నీ జనరల్ పామ్ బాండీపై అభిశంసన తీర్మానం తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఎప్స్టీన్ పత్రాలన్నింటినీ పూర్తిగా బహిర్గతం చేయాలనే చట్టం ఉన్నప్పటికీ.. న్యాయ శాఖ కొన్ని కీలక అంశాలను దాచిపెట్టిందని ఆయన మండిపడ్డారు. మొత్తానికి ఎప్స్టీన్ మరణించినప్పటికీ అతను సృష్టించిన లైంగిక నేరాల సామ్రాజ్యం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో బడా బాబులను నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా విడుదలైన పత్రాలు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.
