బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు రసవత్తరమైన ముగింపు దశకు చేరుకుంది. కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫినాలేకు సమయం ఆసన్నమైంది. టైటిల్ రేసులో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కళ్యాణ్, సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. టైటిల్‌ను ముద్దాడే అదృష్టవంతుడు ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమయాలో బిగ్ బాస్ మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వీకెండ్ ఎపిసోడ్ ను సెలబ్రిటీల ఎంట్రీతో ఈ షోకు మరింత హైప్ ను క్రియేట్ చేశారు. ఈ క్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బిగ్ బాస్ బజ్ హోస్ట్, హీరో శివాజీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది.
హౌస్‌లో శివాజీ సందడి..
సాధారణంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తన ఇంటర్వ్యూలతో ఒక ఆట ఆడుకునే శివాజీ, నేరుగా హౌస్‌లోకి అడుగుపెట్టడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తన కొత్త సినిమా ‘సాంప్రదాయిని సుప్పినీ సుద్దపూస’ ప్రమోషన్స్‌లో భాగంగా, నటి లయ, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ తో కలిసి శివాజీ ఎంట్రీ ఇచ్చారు. సీక్రెట్ రూమ్ నుండి శివాజీ ఒక్కసారిగా బయటకు రావడంతో టాప్ 5 కంటెస్టెంట్స్ అవాక్కయ్యారు. శివాజీ రాకతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తనదైన మార్కు సెటైర్లు, చమత్కారాలతో ఆయన కంటెస్టెంట్లను పలకరించిన తీరు నవ్వులు పూయించింది.
పవన్, సంజనలపై శివాజీ సెటైర్లు
హౌస్‌లోకి రాగానే డీమన్ పవన్‌ను చూసి "అరెరే.. చిలక ఒకచోట, గోరింక ఒకచోట.. చాలా బాధలో ఉన్నావురా" అంటూ రీతూ చౌదరి ఎలిమినేషన్‌ను ఉద్దేశించి శివాజీ వేసిన జోక్ హౌస్‌ను షేక్ చేసింది. ఇక సంజనను వదలకుండా.. "నీ చేతులకి ఇంకా దురదలు తగ్గలేదా? ఈ రోజుకి గడిచిపోయింది అమ్మయ్య" అంటూ ఆమెను ఆటపట్టించారు. శివాజీ హౌస్‌లోకి వెళ్లడం అంటే కేవలం సరదా మాత్రమే కాదు, కంటెస్టెంట్లలో ఉన్న టెన్షన్‌ను తగ్గించి ఫినాలే కోసం వారిని సిద్ధం చేయడం కూడా బిగ్ బాస్ ఒక ముఖ్య ఉద్దేశం.
వైరల్ సీన్ రీక్రియేషన్..
ఈ ఎపిసోడ్‌లో హైలైట్ అంటే.. శివాజీ, లయ కలిసి చేసిన ఒక పేరడీ. హౌస్‌లో గతంలో వైరల్ అయిన రీతూ - డీమన్ పవన్ మధ్య జరిగిన ఎమోషనల్ సీన్స్‌ను వీరు రీక్రియేట్ చేశారు. లయ వంట చేస్తుండగా... శివాజీ వెళ్లి పలకరించడం.. 'నేను కట్ చేస్తున్నాను కదా.. నువ్వు వెళ్లి వేరే పని చేసుకో అంటూ లయ రిప్లై ఇస్తుంది. బావుంది పని చేస్తా అన్నా కోపాలే ఇక్కడ అని శివాజీ అంటారు. ఆ తర్వాత యాపిల్ ఇచ్చి బుజ్జగించే సీన్ మొత్తం హౌస్‌లో నవ్వుల పువ్వులు పూయించింది.
తీసుకో.. నువ్వు అర్థం చేసుకోవట్లేదురా.. నేను ఏ ఉద్దేశంలో అన్నాను అసలు..అసలు అందరికీ ఎలా ఉంటది నా గురించి ఏమనుకుంటారు వాళ్లంతా..? అసలు ఏంటి నువ్వు.. నువ్వు అలా అనొచ్చా నన్ను..? నేను అనలేదురా.. అనకూడదు.. వద్దు వద్దు.. ఏడవద్దు అమ్మ.. ఏడవద్దు అని లయను బుజ్జగిస్తాడు. 'డీమన్' లాగా నటిస్తూ చేసిన మేనరిజమ్స్ చూసి కంటెస్టెంట్స్ కడుపుబ్బ నవ్వుకున్నారు. శివాజీ నటనను చూసి స్వయంగా పవన్ కూడా సిగ్గుపడుతూ నవ్వడం ఈ ఎపిసోడ్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గ్రాండ్ ఫినాలే గెలిచేది ఎవరు?
చివరగా కంటెస్టెంట్స్ అందరూ కలిసి 'నీతోనే డ్యాన్స్ టూ నైట్' సాంగ్‌కు స్టెప్పులు వేయడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. గ్రాండ్ ఫినాలేకు ముందు ఇలాంటి ఎనర్జిటిక్ ఎపిసోడ్ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించింది. శివాజీ రాకతో షో రేటింగ్స్ మరోసారి టాప్‌లో ఉండే అవకాశం ఉంది. వినోదం ఒకవైపు సాగుతున్నా, సోషల్ మీడియాలో మాత్రం "విన్నర్ ఎవరు?" అనే చర్చ హీటెక్కుతోంది. ఓటింగ్ సరళిని గమనిస్తే.. కళ్యాణ్ , తనూజ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. మరి ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్‌ను ముద్దాడే ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే మరో కొన్ని గంటలు వేచి చూడాల్సిందే!
