ఫ్యూచర్ సిటీ లే అవుట్.. 3 వేల ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ గోల్ఫ్ కోర్స్

ఫ్యూచర్ సిటీ లే అవుట్.. 3 వేల ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ గోల్ఫ్ కోర్స్

భారత్​ ఫ్యూచర్ సిటీ’ ప్రణాళికలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. సింగపూర్‌‌కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈ మెగా ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దుతున్నది. మొత్తం 30 వేల ఎకరాల విస్తీర్ణంలో.. అత్యాధునిక నగరంగా దీనిని తీర్చిదిద్దేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నది. ఇందులో 15 వేల ఎకరాలను కోర్ సిటీ డెవలప్‌‌మెంట్‌‌కు, మరో 15 వేల ఎకరాల ఫారెస్ట్‌‌ను అర్బన్ ఫారెస్ట్ యాక్టివిటీస్‌‌కు కేటాయించారు.  సింగపూర్ కన్సల్టెన్సీ ప్రాథమిక నివేదిక ప్రకారం.. ముచ్చర్ల, మీర్‌‌ఖాన్‌‌పేట, పన్ దండు, కందుకూరు గ్రామాల పరిధిలోని  వేల ఎకరాల్లో ఈ మెగా సిటీ విస్తరించనున్నది. భౌగోళిక అనుకూలతలు, నేల స్వభావం  ఆధారంగా ఏ వింగ్ ఎక్కడ ఉండాలన్నది నిర్ణయించారు. హైవేకు ఇటువైపు కోర్ సిటీ, అటువైపు ఎకో -టూరిజం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.  ఈ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రధానంగా 15 వేల ఎకరాల్లో ఏ వింగ్ ఎక్కడ ఉండాలి? రోడ్ల వెడల్పు ఎంత? డ్రైనేజీ సిస్టమ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్‌‌లాంటి అంశాలపై డీపీఆర్ తుది దశకు చేరుకుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ చిక్కులు లేకుండా గ్రిడ్ రోడ్లు, మెట్రో కనెక్టివిటీని ప్రధాన లే అవుట్‌‌లోనే చేర్చారు. ‘నెట్ జీరో’ సిటీగా కార్బన్ ఉద్గారాలు లేని నగరంగా దీనిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పక్కా ప్రణాళికతో  పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది.  ఈ మొత్తం ప్రాజెక్టులో అవినీతికి ఆస్కారం లేకుండా, అత్యున్నత ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల విధానానికే మొగ్గు చూపుతున్నది.  

కొండలు, గుట్టలు లేకుండా సాఫీగా ఉండే మైదాన ప్రాంతాలను స్పోర్ట్స్ సిటీ కోసం కేటాయించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. 3 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్లాన్​ చేశారు.  ఒలింపిక్స్ స్థాయి క్రీడలను నిర్వహించే సామర్థ్యంతో ఈ స్పోర్ట్స్ విలేజ్ ఉండబోతున్నది. ఇందులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంతోపాటు ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్, హాకీ, టెన్నిస్ కోర్టులకు ప్రత్యేక జోన్లను కేటాయించారు.   భవిష్యత్తులో కామన్‌‌‌‌‌‌‌‌వెల్త్ లేదా ఏషియన్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లాంటివి  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగితే, ఈ ఫ్యూచర్ సిటీనే ప్రధాన వేదిక కానున్నది. ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న పెద్ద చెరువులు, కుంటలను కలుపుతూ.. ‘బ్లూ-గ్రీన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్’ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ విభాగాన్ని డిజైన్ చేస్తున్నారు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు, వీఎఫ్ఎక్స్  హబ్‌‌‌‌‌‌‌‌లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి.  సిటీకి ఏ మూల నుంచి అయినా ఇక్కడికి 15 నిమిషాల్లో చేరుకునేలా అంతర్గత రోడ్ల అనుసంధానం ఉంటుంది.  శ్రీశైలం హైవేకి ఇరువైపులా హై-డెన్సిటీ కమర్షియల్ జోన్‌‌‌‌‌‌‌‌ను ప్రతిపాదించారు. అంటే.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌‌‌‌‌‌‌‌లు, స్టార్ హోటల్స్ అన్నీ మెయిన్ రోడ్డుకు ఆనుకొనే ఉంటాయి. దీని వెనుక భాగంలో.. అంటే ఐటీ సిటీకి, కమర్షియల్ జోన్‌‌‌‌‌‌‌‌కు మధ్యలో ‘రెసిడెన్షియల్ టౌన్‌‌‌‌‌‌‌‌షిప్స్’ వస్తాయి.