ఓడిన సర్పంచ్ అభ్యర్థిని ఊళ్లోకి రాకుండా అడ్డుకున్న గ్రామస్థులు.. పోలీసులపై దాడులు.. ఆ ఊళ్లో రచ్చ రచ్చ

ఓడిన సర్పంచ్ అభ్యర్థిని ఊళ్లోకి రాకుండా అడ్డుకున్న గ్రామస్థులు.. పోలీసులపై దాడులు.. ఆ ఊళ్లో రచ్చ రచ్చ

సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ.. కొన్ని గ్రామాల్లో వివిధ పార్టీల వర్గాల మధ్య రాజుకున్న అగ్గి మాత్రం చల్లారడం లేదు. గెలిచిన వారికీ, ఓడిన వారికీ మధ్య అక్కడక్కడ యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఓడిన సర్పంచ్ అభ్యర్థిని ఊళ్లోకి రాకుండా మరో వర్గం అడ్డుకోవడం యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సర్దిచెప్పిన పోలీసులపై దాడులు చేయడంతో ఇప్పుడు ఆ ఊరు నివురు గప్పిన నిప్పులా మారిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. నేరేడిగోండ మండలం చిన్నబుగ్గారం గ్రామంలో పోలీసులపై దాడికి దిగారు గ్రామంలోని ఒక వర్గం సభ్యులు. దీంతోగ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిని గ్రామానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అభ్యర్థి వెళ్లే ప్రధాన రహదారిని ఎడ్లబండ్లు అడ్డంపెట్టి మూసివేసేందుకు ప్రయత్నం చేశారు. 

అభ్యర్థి ఫిర్యాదు మేరకు రోడ్డుపై నుంచి ఎడ్ల బండ్లను తీపించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులకు, ఓడిపోయిన అభ్యర్థి కుటుంబం మధ్య వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి పోలీసులపై దాడి చేసింది ఓడిపోయిన అభ్యర్థి కుటుంబం. ఇద్దరు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలు బాహాబాహీకి సిద్ధమవటంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. కాసేపు గొడవ సద్దుమనిగింది అనుకునే లోపే మళ్లీ మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతుండటంతో.. ఆ ఊరు ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా తయారయ్యింది. చిన్న బుగ్గారం గ్రామంపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టి నిఘా పెంచారు.