ఇది అయోధ్య కాదు.. ఇక్కడికి వచ్చి ఎవరూ బాబ్రీ మసీదును తాకలేరు: MLA హుమాయున్ కబీర్

ఇది అయోధ్య కాదు.. ఇక్కడికి వచ్చి ఎవరూ బాబ్రీ మసీదును తాకలేరు: MLA హుమాయున్ కబీర్

కోల్‎కతా: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదు నమూనాలో కొత్త మసీదు నిర్మాణానికి టీఎంసీ సస్పెండెడ్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (డిసెంబర్ 19) ఓ నేషనల్ మీడియా ఛానెల్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హుమాయున్ కబీర్ మాట్లాడుతూ.. ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీకి ప్రతీరూపంగా నిర్మిస్తోన్న మసీదును మూడేళ్లలో పూర్తి చేస్తామని.. ఏ వ్యక్తి, శక్తి దానిని ఆపలేరని హాట్ కామెంట్స్ చేశారు. 

2026, ఫిబ్రవరిలో మసీదు నిర్మాణం ప్రారంభమవుతుందని.. డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడే అయోధ్యలో మళ్లీ మసీదు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నానని.. కానీ 2019లో అయోధ్యలోని స్థలాన్ని రామాలయానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ముర్షిదాబాద్‎లో మసీదు నిర్మిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. బాబర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ముస్లిం ప్రజల బాధ చూసి బాబ్రీ మసీదు అని పేరు పెట్టానని చెప్పారు. 

►ALSO READ | తమిళనాడులో SIR పూర్తి.. కోటి మంది ఓటర్లను తొలగించిన ఈసీ.. ఒక్క చెన్నైలోనే 15 లక్షల ఓటర్లు ఔట్

ఇది అయోధ్య కాదు ముర్షిదాబాద్ అని.. ఇక్కడికి వచ్చి ఎవరూ బాబ్రీ మసీదును తాకలేరని కబీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో జై శ్రీరామ్ అని నినాదాలు చేయడం కరెక్ట్ అయితే.. అల్లా హు అక్బర్ అని స్లోగన్స్ చేయడం కూడా సరైనదేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు ప్రతిరూపానికి శంకుస్థాపన చేయడంతో హుమాయున్ కబీర్‎ను టీఎంసీ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.