హైదరాబాద్ లో ఉన్న చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా.. విమర్శలు, ప్రశంసల నడుమ తనపని తాను చేసుకుంటూ పోతోంది. కబ్జాకోరల్లో చిక్కుకుని కనుమరుగైన చెరువలను పునరుద్ధరిస్తూ నగరవాసులకు అందిస్తోంది. ఇప్పటికే బతుకమ్మ కుంట, సున్నం చెరువులను పునరుద్ధరించిన హైడ్రా.. లేటెస్టుగా నిజాంల నాటి చారిత్రక బమ్రుక్న్ ఉద్దౌలా చెరువుకు పునర్జన్మనిచ్చింది. సర్వాంగ సుందరగంగా తీర్చిదిద్దిన ఈ చెరువులు ప్రారంభానికి ముస్తాబయ్యింది.
బమ్రుక్న్ ఉద్దౌలా చెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేపట్టింది హైడ్రా. 2026 జనవరిలో బమ్రుక్న్ ఉద్దౌలా చెరువు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
నిజాం కాలంనాటి వారవసత్వ చెరువును నగరవాసులకు అందించే క్రమంలో అత్యంత సర్వాంగ సుందరంగా చెరువును తీర్చిదిద్దారు. చెరువుకు సులభంగా చేరుకునేలా రహదారులు, ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. బండ్ పై వాకింగ్ ట్రాక్ లు, లోపల ఫెన్సింగ్ పనులను పరిశీలించారు హైడ్రా కమిషనర్. చిన్నారుల కోసం ప్లే ఏరియాలు ఏర్పాటు చేశారు. పార్కులు, ఓపెన్ జిమ్ లతో విహార కేంద్రంగా అభివృద్ధి చేశారు. అంతే కాకుండా ఔషధ గుణాలున్న మొక్కలు, పచ్చని వాతావరణంపై ప్రత్యేక దృష్టి సారించారు.
నిజాంల కాలంలో వాడిన రాతితో కట్టడాలను పటిష్టంగా పునరుద్ధరించారు. ఇన్ లెట్‌లు, ఔట్ లెట్ లు విశాలంగా నిర్మించారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్ ల నుంచి వరద నీరు చెరువులో చేరేలా ఏర్పాట్లు చేశారు. వరద సమస్యలకు చెక్ పెట్టేలా చెరువు అభివృద్ధి చేశారు. చెరువు పరిసరాల్లో సీసీటీవీ కెమేరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.
గత ఏడాది ఆగస్టులో చెరువు ఆక్రమణలు తొలగించిన హైడ్రా పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అభినందనలు తెలిపారు. పాతబస్తీకి మణిహారంగా బమ్రుక్న్ ఉద్దౌలా చెరువును తీర్చిదిద్దారు. మరికొద్ది రోజుల్లో చెరువును ప్రారంభించనున్నారు.
