- జీవో జారీ చేసిన సహకార శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (ప్యాక్స్) నిర్వహణ విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సొసైటీల్లో కొనసాగుతున్న అనఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీల పాలనకు స్వస్తి పలికింది. ఇకపై సొసైటీల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా అధికారులకే (అఫీషియల్ పర్సన్ -ఇన్‌చార్జ్) అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 14న జారీ చేసిన జీఓ నంబర్ 386ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆ జీఓ ద్వారా నియమితులైన కమిటీలను రద్దుచేస్తూ, ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీలను నియమించాలని సహకార శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ జీఓ ఆర్టీ నంబర్ 597ను విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్త మండలాల ఏర్పాటుకు అనుగుణంగా ప్యాక్స్ పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
