మాట మార్చేసిన ఐబొమ్మ రవి!.. స్టేట్మెంట్ లలో తేడాలపై లోతుగా పోలీసుల విచారణ

మాట మార్చేసిన ఐబొమ్మ రవి!.. స్టేట్మెంట్ లలో తేడాలపై లోతుగా పోలీసుల విచారణ

బషీర్​బాగ్, వెలుగు: ఐబొమ్మ రవి రెండో రోజు కస్టడీ విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం పలు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. తొలిరోజు విచారణలో రవి స్నేహితులు ప్రహ్లాద్, ప్రసాద్ పాత్రపై ప్రధానంగా ఆరా తీశారు. అయితే ఇప్పటికీ ప్రహ్లాద్ ఆచూకీ పోలీసులకు తెలియలేదు. ప్రహ్లాద్ పేరుతోనే ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు ఉపయోగించి రవి కరేబియన్ దీవుల్లో పౌరసత్వం పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఐబొమ్మ వెబ్​సైట్​ను కూడా ప్రహ్లాద్ పేరుపైనే నమోదు చేసినట్లు సమాచారం. 

ప్రహ్లాద్ తనకు తెలియదని రవి ప్రస్తుతం చెబుతున్నప్పటికీ, గతంలో చేపట్టిన 8 రోజుల కస్టడీ విచారణలో అమీర్​పేట్​లో పరిచయమయ్యాడని రవి వెల్లడించాడు. ప్రస్తుత కస్టడీ విచారణలో మాత్రం తన మాట మార్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవి ఇచ్చిన స్టేట్​మెంట్​లలో తేడాలపై పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఇంకా కస్టడీ విచారణకు మరో పది రోజులు మిగిలి ఉండటంతో, రవి నుంచి మరింత కీలక సమాచారం రాబట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.