ఆధ్యాత్మికం: పుష్యమాసం ప్రారంభం ..శని దేవుడికి ఇష్టం.. ఇలా చేస్తే సోమరితనం.. దరిద్రం ఉండదు..!

ఆధ్యాత్మికం:  పుష్యమాసం ప్రారంభం ..శని దేవుడికి ఇష్టం.. ఇలా చేస్తే  సోమరితనం.. దరిద్రం ఉండదు..!

పుష్యమాసం.. ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మాసంలో చేసే పూజలు, దానధర్మాలు, జపాలు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పుష్యమాసం శనితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ధనుర్మాసం తర్వాత వస్తుంది. ఆధ్యాత్మికంగా పుష్యమాసం విశిష్టత.. ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. . 

పుష్యమాసం ప్రారంభం అయింది. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసమే పుష్యమాసం.
“పుష్య” అంటే పోషణ, శక్తి, శుద్ధత్వానికి సంకేతం.ఈ మాసం శీతాకాలంలో వస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా అత్యంత శ్రేష్ఠమైనది. ఈ ఏడాది (2025) డిసెంబర్​ 20 వ తేదీన ప్రారంభమైన పుష్యమాసం 2026 జనవరి  18 వతేది వరకు ఉంటుంది. 

పండితులు తెలిపిన వివరాల ప్రకారం  జప, తప, ధ్యాన, పారాయణలకు పుష్యమాసం అత్యుత్తమం. పితృదేవతలను పూజించడానికి ... దోష విమోచనానికి ఇది పవిత్ర మాసమని చెబుతున్నారు.వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి శ్రావణ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి వరకు సమయం అత్యంత శుభమని పురాణాల ద్వారా తెలుస్తుంది.

 శివుడికి కార్తీకం లో, విష్ణువుకు ఆశ్వీయుజం ఎలా ఉంటాయో, శనీశ్వరుడికి పుష్యమాసమే పరమ ప్రీతికరం.ఎందుకంటే శని జన్మనక్షత్రం పుష్యమి.పుష్యమంతా శని పూజ చేస్తే అనర్ధాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో ప్రత్యేక శని భగవానుడికి ఆరాధన చేయాలి. ఈ నెల రోజులు ఉదయం స్నానం చేసి శనిభగవానుడికి  ప్రార్థించాలి.ఈ నెలలో చేసే గింజంత దానమైనా అనంత పుణ్య ఫలాన్ని ఇస్తుందని అంటారు. నదీ స్నానాలు సూర్యారాధనతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితుల వాక్కు.

పుష్య పౌర్ణమి రోజున శనికి తైలాభిషేకం, నువ్వులు–బెల్లం దానం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నువ్వులు, బెల్లం చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుతాయి .. ఇదే దీని శాస్త్రీయ కోణం.గరుడ పురాణం ప్రకారం నాభి స్థానం శని స్థానం. ఇది మానవుని శరీరంలోని అత్యంత శక్తివంతమైన ప్రదేశం. కాబట్టి ఈ మాసంలో మనస్సు, శరీరం, శక్తి అన్నీ సంతులిత స్థితిలో ఉంటాయి.పుష్యమాసం తొలి అర్ధభాగం విష్ణు ఆరాధనకు శ్రేష్ఠ కాలం.పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు తులసీదళాలతో హరిని అర్చిస్తే సౌందర్యం, శాంతి లభిస్తాయని అంటున్నారు ఆధ్యాత్మిక  వేత్తలు.

పెళ్లి కాని అమ్మాయిలు ఈ ఆధ్యాత్మిక నెలలోనే కాత్యాయని వ్రతం ఆచరిస్తారు. పుష్య మాసం పౌర్ణమి నాడు నదీ స్నానమాచరించడం వల్ల పుణ్యం కలుగుతుంది. శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల సౌందర్యాన్ని పొందుతారు.పుష్యమాసం  సోమవారాల్లో  మారెడు దళాలతో శివార్చన.... ఆదివారాల్లో జిల్లేడు పూలతో సూర్యారాధన.. శనివారాల్లో శని భగవానుడికి నల్లనువ్వులు.. తైలాభిషేకం.. నువ్వులు.. బెల్లం దానం చేస్తే జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక తమిళులు పుష్యమాసంలో షష్ఠి రోజున కుమారస్వామిని  విశేషంగా పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర శుద్ధ షష్ఠి రోజు వల్లీ దేవత శుభ్రమణ్య స్వామిని ఎంత పవిత్రంగా పూజిలస్తారో .... తమిళులు పుష్యమాసంలో శుద్ద షష్టి రోజున అంత పవిత్రంగా  స్కంద పూజను నిర్వహిస్తారు. 

పుష్య మాసం  శుక్ల అష్టమి పితృ పూజకు అత్యంత అనుకూలమని పండితులు చెబుతున్నారు.  పితృదేవతలకు ఈ రోజు పండుగ రోజు..అందుకే దేవాలయాల్లో బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలని అంటున్నారు పండితులు. పుష్య మాసంలోని శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఇది సంతానం, శాంతి, శుభాలు ఇచ్చే ఏకాదశిగా వర్ణించారు. పుష్యమాసంలో వస్త్రదానం విశేష పుణ్యప్రదం. చలి నుండి బాధపడేవారికి సహాయం చేయడం .. ఈ నియమం వెనుక ఆచారం.

 పుష్యమాసంలో సంక్రాంతి  మహాపండుగ. దీనికి ముందు రోజు భోగి పండుగను నిర్వహిస్తారు. చీకటిని.. చెడును.. దూరం చేసేందుకు చలిమంటలు. .. భోగి మంటలు వేస్తారు.  ఈ రోజుతోదక్షిణాయనం ముగుస్తుంది.  అంటే..  ధనుర్మాసం ముగింపు  రోజు కూడా ఇదే.

 మకర సంక్రాంతి రోజు  .. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజున శివుడిని నువ్వులు, ఆవు నెయ్యితో అభిషేకిస్తే  దరిద్రం తొలగి భోగభాగ్యాలు పెరుగుతాయి.  ఆ తరువాత రోజు కనుమ వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను..  పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ అమావాస్య – చొల్లంగి అమావాస్య .. ఆ రోజు పితృ తర్పణం, అన్నదానం విశేష పుణ్యం.పితృదేవతల అనుగ్రహం అత్యంత బలంగా ప్రసరించే రోజని పండితులు చెబుతున్నారు.

 పుష్యమాసంలో సూర్యోదయ కాంతి అత్యంత పవిత్రమైన యోగ చైతన్యం ఉన్న కిరణాలు ఇస్తుంది.ఈ కాంతి మనసులోని అశుద్ధతలను తొలగించి బుద్ధి–ప్రాణశక్తిని బలపరుస్తుంది. అంతేకాదు ఈమాసంలో శరీరం, మనసు, ఆత్మ ..ఈ మూడు శుద్ధి పొందే దివ్యకాలం. పోషణం, శాంతి, చైతన్యం, ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగించే పవిత్ర మాసం... పుష్యమాసం.

పుష్య మాసంలో ప్రతి శనివారం  ఇంట్లో సాంబ్రాణి వెలగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి...  మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. .. ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.