రైతులకు అందిన సన్నవడ్ల బోనస్..ఒక్కరోజే 649.84 కోట్లు విడుదల

రైతులకు అందిన సన్నవడ్ల బోనస్..ఒక్కరోజే 649.84 కోట్లు విడుదల
  • బోనస్​ రూ.962.84 కోట్లు
  • ఈయేడు ఇప్పటికే 59.74 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
  • రైతులకు మొత్తం రూ.13, 833 కోట్లు చెల్లింపులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్​కు రూ.500 చొప్పు న సర్కారు బోనస్​ను విడుదల చేసింది. శుక్రవారం ఒక్కరోజే రూ.649.84 కోట్లు రిలీజ్  చేసింది. దీంతో రాష్ట్ర రైతులకు బోనస్ రూపంలో ఇప్పటి వరకు రూ.962.84 కోట్లు అందాయి. శుక్రవారం నాటికి రాష్ట్రంలో 11.45లక్షల మంది రైతులకు చెందిన 59.74  లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 

సన్నాలు 30.35 లక్షల టన్నులు 

ఈయేడు వానాకాలంలో సన్నాల సాగు భారీగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు సెంటర్లలో 29.39లక్షల టన్నుల దొడ్డువడ్లు కొనుగోలు చేయగా, మరో  30.35లక్షల టన్నుల సన్న వడ్లు సర్కారు సివిల్ సప్లయ్స్​ ద్వారా సేకరించింది.  సన్నవడ్లకు  సంబంధించి శుక్రవారం ఒకే ఒక్క రోజే రూ. 649.84 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను 2 లక్షల 49 వేల 406 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

వడ్ల పైసలు రూ.13,833 కోట్లు చెల్లింపులు 

ఈ వానాకాలం సీజన్​కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై సర్కారు రెండు రోజుల్లోనే నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 59.74 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరి గాయి. దీనికి గాను ఇప్పటి వరకు  రూ.13,833కోట్లు సివిల్​ సప్లయ్స్ డిపార్ట్​మెంట్​ రైతులకు చెల్లింపులు చేసింది.

 రైతులు ధాన్యం విక్రయించిన వెంట వెంటనే మిల్లులకు తరలించడంతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నామని సివిల్​సప్లయ్స్​కమిషనర్ స్టీఫీన్ రవీంద్ర వెల్లడించారు. సన్న వడ్లకు సంబంధించి శుక్రవారం ఒక్క రోజే రూ.649.84 కోట్ల విలువైన 268 చెక్కులను 2,49,406 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.