- పెద్ద కొడుకుపైనా దాడి, తీవ్ర గాయాలు
గద్వాల, వెలుగు : కుటుంబ గొడవల కారణంగా ఓ వ్యక్తి కర్రతో కొట్టి భార్య, పెద్దకొడుకుపైన దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భార్య అక్కడికక్కడే చనిపోగా, పెద్దకొడుకు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఘటన గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
గ్రామానికి చెందిన గోవింద్, జమ్ములమ్మ (28) భార్యాభర్తలు. ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. దీంతో పెద్దకొడుకు మల్లికార్జున్ ఇద్దరిని అడ్డుకున్నాడు. ఆగ్రహానికి గురైన గోవింద్ కర్రతో మల్లికార్జున్ తలపై కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
గమనించిన జమ్ములమ్మ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగులగొట్టడంతో అందరూ బయటకు వచ్చారు. తర్వాత గోవింద్ కర్రతో జమ్ములమ్మపై దాడి చేసి పలుమార్లు తలపై కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం గాయపడిన మల్లికార్జున్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా గోవింద్ మానసిక స్థితి సరిగా లేదని, గతంలో ట్రీట్‌మెంట్ ఇప్పించినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో సైకోగా బిహేవ్ చేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు.
