న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ హవా కొనసాగుతున్నది. ఆయన పెట్టే ట్వీట్లకు లైక్‌ల వర్షం కురుస్తున్నది. గత 30 రోజుల్లో అత్యధిక లైకులు వచ్చిన 10 ట్వీట్లలో 8 ప్రధానివే ఉన్నాయని ‘ఎక్స్’ సంస్థ వెల్లడించింది. కాగా, భారత పర్యటనకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినప్పుడు ఆయనకు ప్రధాని మోదీ భగవద్గీత (రష్యా ఎడిషన్)ను బహుమతిగా ఇచ్చారు. దీన్ని ‘ఎక్స్’లో పోస్టు చేయగా 6.7 మిలియన్ల వ్యూస్, 2 లక్షలకు పైగా లైకులతో మొదటి స్థానంలో నిలిచింది.
పుతిన్‌కు మోదీ స్వాగతం పలికే పోస్ట్ 10.6 మిలియన్ల రీచ్‌తోపాటు 2.14 లక్షల లైకులు సాధించి రెండో స్థానంలో ఉన్నది. మిగిలిన స్థానాల్లో పుతిన్ పర్యటనకు సంబంధించిన మరో పోస్టు, వేదమూర్తి దేవవ్రత్ గురించి చేసిన పోస్టు, అయోధ్యలో ధ్వజారోహణ పోస్టు, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌కు వివాహ శుభాకాంక్షలు చెప్పిన పోస్టు, టీ20 వరల్డ్ కప్‌లో ఇండియన్ బ్లైండ్ విమెన్ క్రికెట్ టీం విజయం సాధించిన పోస్టు, ప్రధాని ఒమన్‌కు వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పురస్కారం అందించిన పోస్టు ఉన్నాయి.
