హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేర్లపై ఇరిగేషన్ శాఖ కసరత్తులను వేగవంతం చేసింది. పునరుద్ధరణ డిజైన్లకు ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌ను మూడు సంస్థలకు పంపించగా.. తాజాగా శుక్రవారం ఆ బిడ్లను తెరిచారు. హైదరాబాద్ జలసౌధలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఆఫీసులో ఈఎన్సీ జనరల్ అంజద్ హుస్సేన్ నేతృత్వంలో ఆ బిడ్లను ఓపెన్ చేశారు. బ్యారేజీల డిజైన్లకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను ఆహ్వానించగా.. ఐదు సంస్థలు ఇప్పటికే బిడ్లు దాఖలు చేశాయి.
అందులో నుంచి ఐఐటీతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడిన ఆర్వీ అసోసియేట్స్ + ఐప్రీసస్, డీఎంఆర్ + ఆర్డీఎం + ఇంట్రాప్లాన్ జేవీ, ఆఫ్రీ కంపెనీలకు ఇరిగేషన్ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పంపించింది. ఈ నెల 12నే బిడ్లను తెరవాల్సి ఉన్నా.. కంపెనీలు కొంత సమయం కావాలని అడగడంతో 19కి పొడిగించారు. సంస్థల సాంకేతిక అర్హతలను సీడీవో అధికారులు పరిశీలించి.. రిపోర్టు సబ్మిట్ చేయనున్నారు.
