హైదరాబాద్, వెలుగు: సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయినా.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జిల్లాల పర్యటనలకు వెళ్లడం చూస్తే జాలేస్తున్నదని విప్ బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం సీఎల్పీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసమర్థుడి జీవయాత్రలా కేటీఆర్ టూర్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
రేవంత్ దమ్ము ఏంటో మీ అయ్యను అడుగు: ఆది శ్రీనివాస్
సీఎం రేవంత్ రెడ్డి దమ్ము, ధైర్యం గురించి కేటీఆర్ పదేపదే మాట్లాడుతున్నారని, ఆయన దమ్ము గురించి ఫామ్ హౌస్ లో ఉన్న తన తండ్రి కేసీఆర్ ను అడగాలని కేటీఆర్ కు విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెండింట్లోనూ కాంగ్రెస్ గెలిచిందని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన గుర్తుచేశారు.
