- హైదరాబాద్.. సినిమాకు పర్యాయపదం: మంత్రి వెంకట్ రెడ్డి
- సిటీకి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది: మంత్రి జూపల్లి
- ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’కు హాజరు
హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణను దేశంలోనే ఫిల్మ్ మేకర్స్‌కు బెస్ట్ స్టేట్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైన ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గౌరవ అతిథిగా అటెండ్ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ‘‘హైదరాబాద్ అంటేనే సినిమాకు పర్యాయపదంగా మారింది. దేశవ్యాప్తంగా ఫిల్మ్ మేకర్స్ ఇక్కడికి వచ్చి సినిమాలు తీస్తున్నరు. పెద్ద సినిమాలతో పాటు షార్ట్ ఫిల్మ్స్ కూడా హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచుతున్నాయి. కొత్త టాలెంట్ ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ నుంచే వస్తున్నది. ఈ షార్ట్ ఫిల్మ్స్ యువతకు సృజనాత్మక స్వేచ్ఛను ఇస్తాయి. ఇప్పుడు పెద్ద పోజీషన్స్లో ఉన్న ఎంతో మంది డైరెక్టర్లు.. షార్ట్ ఫిల్మ్స్‌తోనే తమ ప్రస్థానం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సినీ రంగానికి పూర్తి మద్దతు ఇస్తున్నది’’అని మంత్రి అన్నారు.
వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నం: జూపల్లి
హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ‘‘హైదరాబాద్‌లో నిర్వహించే సదస్సులు, ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 10 దేశాల నుంచి 704 చిత్రాలు రావడం నగర సృజనాత్మకతకు నిదర్శనం. హైదరాబాద్.. సినిమాకు పుట్టినిల్లులాంటిది. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ, రామానాయుడు, సారథి వంటి స్టూడియోలు ప్రపంచ స్థాయి సినిమాలకు వేదికలయ్యాయి.
ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక సాంకేతికతతో కొత్త స్టూడియోలను నిర్మిస్తున్నం’’అని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక, ప్రముఖ దర్శకుడు ఉమా మహేశ్వర రావు, నర్సింగరావు, అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు జూడీ గ్లాడ్‌స్టోన్, మైథిలి రావు, నగేశ్ కునూరర్, లీమా దాస్, సుంజు బచుస్పతిమయుమ్, ఉత్పల్ బోర్పుజారి హాజరయ్యారు.
