అమ్రాబాద్, వెలుగు: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ శుక్రవారం కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వైపు పయనమయ్యారు. మార్గ మధ్యలో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ మృగవని రిసార్ట్ వద్ద ఆగారు.
అక్కడ జ్ఞానేశ్ కుమార్‌ను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, నంద్యాల జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ పూల బొకేలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రిసార్ట్‌లో కాసేపు విరామం తీసుకున్న తర్వాత జ్ఞానేశ్ కుమార్ నేరుగా శ్రీశైలం ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
