- భూ భారతిలో మార్పుచేర్పులకు లంచాలు డిమాండ్
- అన్నీ సక్రమంగా ఉన్నా..పైసలిస్తేనే ఫైల్ క్లియర్
- 9 జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు
- ఎమ్మార్వోలు, ఆర్డీవోలు రికమండ్ చేసిన ఫైళ్లనూ పక్కన పెడ్తున్నరు
- తమ భూమికి తాము లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏంటని బాధిత రైతుల ఆవేదన
- సీసీఎల్‌ఏలో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు:రైతుల భూసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తీసుకొస్తే.. కొందరు అధికారులు దాన్ని వసూళ్ల దందాకు వాడుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో భూభారతి అమలు ద్వారా రైతుల భూసమస్యలు పరిష్కరించాల్సిందిపోయి.. పలువురు అడిషనల్ కలెక్టర్లే ఈ దందాకు తెరతీసినట్టు సర్కార్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
భూభారతిలో రికార్డుల మార్పుచేర్పులకు అడిషనల్ కలెక్టర్లు లంచాలు అడుగుతున్నారని, అన్నీ సక్రమంగా ఉన్నా ఫైల్‌పై సంతకం పెట్టాలంటే పైసలు డిమాండ్ చేస్తున్నారని.. లేదంటే ఏదో ఒక సాకుతో ఫైల్‌ను పక్కన పడేస్తున్నారని ఫిర్యాదుల్లో బాధిత రైతులు పేర్కొంటున్నారు. తాము ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కనికరించని అధికారులు.. మధ్యవర్తుల ద్వారా ముడుపులు అందగానే, గంటల వ్యవధిలో పని పూర్తి చేస్తున్నట్టు సీఎంవోకు పలువురు రైతులు కంప్లయింట్ చేశారు.
రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, కొందరు అధికారులు మాత్రం పాత పద్ధతుల్లోనే దందా కొనసాగిస్తుండటంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయినట్టు తెలిసింది.
సంతకానికో రేటు..
భూభారతి చట్టం అమల్లో భాగంగా అధికారుల స్థాయిని బట్టి ప్రభుత్వం స్పష్టమైన అధికారాలను కట్టబెట్టింది. సాధారణ మ్యుటేషన్లు (రిజిస్ట్రేషన్ వెంటనే), వారసత్వ బదలాయింపులను తహసీల్దార్లకు అప్పగించగా.. అప్పీళ్లు, సివిల్ కోర్టు డిక్రీల అమలును ఆర్డీవోలకు అప్పగించింది. సంక్లిష్టమైన భూములకు సంబంధించిన అధికారాలను మాత్రం అడిషనల్ కలెక్టర్ల పరిధిలోనే ఉంచింది.
ముఖ్యంగా నిషేధిత జాబితా (22-ఏ) నుంచి భూముల తొలగింపు, ప్రభుత్వ భూమిగా పొరపాటున నమోదైన సర్వే నంబర్ల సవరణ, డేటా కరెక్షన్ మాడ్యూల్స్, విస్తీర్ణంలో తేడాల సవరణ, ఆర్డీవో ఉత్తర్వులపై వచ్చే అప్పీళ్ల వంటి కీలక అధికారాలు అడిషనల్ కలెక్టర్లకే ఇచ్చింది. ఈ అధికారాలనే అడ్డంపెట్టుకుని అడిషనల్ కలెక్టర్లు దందాకు తెరదీశారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన క్లిష్టమైన సమస్యలన్నీ వీరి లాగిన్‌లోనే ఉండటంతో, ఒక్కో సంతకానికి రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటికి అదనంగా భూభారతి పోర్టల్‌లో అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ల పరిస్థితి అట్లనే ఉందని తెలిసింది.
ఆ జిల్లాల నుంచే ఎక్కువ కంప్లయింట్స్..
ప్రధానంగా హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల నుంచి కంప్లయింట్ఎక్కువగా ఉన్నట్టు సీఎంవో అధికారులు గుర్తించారు. ఇక్కడ గజం భూమి ధర లక్షల్లో, ఎకరం కోట్లలో ఉండటంతో.. సమస్య పరిష్కారానికి అడిషనల్ కలెక్టర్ల స్థాయి వరకు అధికారులు రూ.లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది.
సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని హై-వాల్యూ జోన్ల నుంచి భూభారతి పోర్టల్‌లోకి వచ్చిన దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ జిల్లాల నుంచే సోషల్ మీడియాలో, ప్రజావాణిలో ఎక్కువ ఫిర్యాదులు వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
తాము నేరుగా వెళ్లి కలుద్దామన్నా అవకాశం ఇవ్వని అధికారులు.. ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా వచ్చే డీల్స్ మాత్రం చక్కబెడుతున్నారని, తమ భూమి తమకు దక్కాలన్నా లంచం ఇవ్వాల్సి వస్తున్నదని బాధితులు సీఎంవోకు కంప్లయింట్చేస్తున్నారు.
అన్నీ కరెక్టుగా ఉన్నా..
భూరికార్డుల్లో చిన్న చిన్న తప్పులు దొర్లినా వాటిని సవరించుకునేందుకు రైతులు నానాతంటాలు పడాల్సి వస్తున్నది. నిజానికి రైతుల వద్ద అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ, ఫైలు ఆమోదం పొందడం లేదు. “అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ సార్‌ను కలవాల్సిందే” అంటూ కింది స్థాయి సిబ్బంది నుంచి సంకేతాలు వెళ్తున్నాయి.
అడిగినంత ఇచ్చుకోలేని సామాన్య రైతుల దరఖాస్తులను ఏదో ఒక సాకు చూపి పక్కన పడేస్తున్నారు. లేదా ‘విచారణలో ఉంది’ అనే కారణంతో డొంకతిరుగుడు సమాధానాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మార్వోలు, ఆర్డీవోలు రిపోర్ట్ రాసి కరెక్షన్చేయాలని, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రికమండ్చేసిన భూముల విషయంలోనూ అదనపు కలెక్టర్లు రిమార్క్‌లు రాసి పక్కన పెడుతున్నారు.
ఇక భూభారతి పోర్టల్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న కొన్ని సాంకేతిక నిబంధనలను కూడా అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. డాక్యుమెంట్లు సరిగా లేవని రిజెక్ట్ చేయడం, లేదా ‘సివిల్ తగాదా’ అని ముద్ర వేసి పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. వాస్తవానికి రైతుల వద్ద పక్కా ఆధారాలు, లింక్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. ఎంతో కొంత ఇస్తే మాత్రం, నిబంధనలను సైతం పక్కన పెట్టి రికార్డుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వానికి చాలా కంప్లయింట్లు వస్తున్నాయి.
సీఎం సీరియస్..
అధికారుల వసూళ్ల దందాపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజలకు మేలు చేస్తుందని తెచ్చిన భూభారతి చట్టాన్ని, రెవెన్యూ సదస్సుల ఆశయాన్ని అధికారులు నీరుగారుస్తుం డటంపై ఆయన సీరియస్‌గా ఉన్నారు. ఆన్‌లైన్ వేదికగా వస్తున్న ఫిర్యాదులను క్రోడీకరిస్తే.. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధికంగా భూసమస్యలు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీఎంవో గుర్తించింది.
సరిగ్గా ఉన్న దరఖాస్తులు ఇంకా ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో సంజాయిషీ ఇవ్వాలని, రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించినట్టు తెలిసింది. కాగా, గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ఏసీబీకి చిక్కడం, ఇటీవల హనుమకొండ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఏసీబీకి పట్టుబడటంతో ఆ స్థాయిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది.
సీసీఎల్ఏలో నిఘా సిస్టమ్!
క్షేత్రస్థాయిలో ఎమ్మార్వో, ఆర్డీవో, అడిషన ల్ కలెక్టర్లు అక్రమాలకు పాల్పడకుండా కళ్లెం వేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయాన్ని రంగంలోకి దించాలని ప్రభుత్వం భావిస్తున్నది. పోర్టల్‌లో ఫైళ్ల కదలికపై నిఘా ఉంచేందుకు సరికొత్త ‘మానిట రింగ్ సిస్టమ్’ను తీసుకురావాలని యోచి స్తున్నది. ఏ అధికారి వద్ద, ఏ రకమైన దర ఖాస్తు ఎన్ని రోజులుగా పెండింగ్‌లో ఉందో రియల్ టైంలో ట్రాక్ చేయనున్నా రు.
దరఖాస్తును తిరస్కరిస్తే దానికి బల మైన, న్యాయపరమైన కారణాన్ని ఆన్‌లైన్ లోనే రికార్డు చేయాల్సి ఉంటుంది. అయి తే ఎమ్మార్వో, ఆర్డీవోలు రికమండ్ చేసిన ఫైల్స్‌ను కూడా వెనక్కి పంపడం, అన్ని కరెక్ట్‌గా ఉన్న వాటిని కూడా ఏదో ఒక కారణంతో పక్కన పెట్టడం వంటి వాటిపై ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. ఇందు కోసం గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేయనున్న ట్టు తెలుస్తున్నది. రైతులను అధికారులు ఇబ్బందులు పెడ్తే.. వాళ్లు సర్వీసు రికార్డు ల్లో ఎంటర్ చేసేలా ప్లాన్చేస్తున్నారు.
