తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • నెదర్లాండ్స్ ఎన్నారైలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపు
  • ఎఫ్​సీసీఐ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్​లో ప్రసంగం

న్యూఢిల్లీ, వెలుగు:నెదర్లాండ్స్​లో ఉన్న ఎన్నారైలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. సస్టైనబిలిటీలో తెలంగాణ ప్రభుత్వం మంచి సహకారాన్ని అందిస్తున్నదని.. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సోలార్, గ్రీన్ కంపెనీలు పెద్ద ఎత్తున ముందుకువస్తున్నాయని ఆయన తెలిపారు. నెదర్లాండ్స్ ఎన్నారైలు స్థాపించిన ఫౌండేషన్ ఫర్ క్రిటికల్ చాయిసెస్ ఫర్ ఇండియా(ఎఫ్ సీసీఐ) రెండు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సమావేశాలు శుక్రవారం ఢిల్లీలోని ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్ లో ప్రారంభమయ్యాయి.

తొలి రోజు ఈ కాన్ఫరెన్స్ కు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తన జీవితంలో సస్టైనబిలిటీ వైపు అడుగులు వేసినట్టు ఎంపీ చెప్పారు. ఎకో ప్రెండ్లీ బిల్డింగ్ ఐటమ్స్ తయారీ దిశలో పనిచేసినట్టు గుర్తు చేసుకున్నారు. సోలార్ టైల్ ను రూపొందించినట్టు తెలిపారు. ఎలాన్ మస్క్ టెస్లా సోలార్ రూఫ్ టైల్స్ తో తాను డెవలప్ చేసిన ఈ  టైల్స్ పోటీ పడ్డాయన్నారు. చివరకు తన సోలార్ టైల్ కు యూఎస్ పేటెంట్ దక్కిందని వివరించారు. 

ఇదే ఉత్సాహంతో ఎలక్ట్రికల్ బైక్స్ రంగంలోకి ప్రవేశించి ఆటమ్ బైక్స్ ను రూపొందించినట్టు తెలిపారు. ఇలా గో గ్రీన్, పర్యావరణం వైపు అడుగులు వేసేలా తన మనసు, ఆలోచనలు ముందుకు సాగాయన్నారు. గ్రీన్ సొల్యూషన్స్​ను ఎలా అడాప్ట్ చేసుకోవాలి? వాటిని ఎలా ఉపయోగించాలో నెదర్లాండ్స్ ప్రజలకు బాగా తెలుసని.. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఆ దేశం అద్భుతాలను సృష్టిస్తోందని ప్రసంశించారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందన్నారు. అయితే, వాతావరణం, వాయు కాలుష్యం, పర్యావరణ విషయాల్లో కొంత ఇబ్బంది ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్​కు సేవలు అందించడమే లక్ష్యం:  ఎఫ్​సీసీఐ వైస్ ప్రెసిడెంట్ 

నెదర్లాండ్స్​లోని ఇండియన్ డయస్పోరా గణనీయమైన గ్రోత్​ను తెలియజేయడం తమ లక్ష్యాల్లో ఒకటని ఎఫ్ సీసీఐ వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ అగర్వాల్ అన్నారు. ఎఫ్ సీసీఐ ఏర్పాటు చేసి 45 ఏండ్లు, భారత్ – నెదర్లాండ్స్ ఫ్రెండ్ షిప్​కు 75 ఏండ్లు పురస్కరించుకొని ఈ కాన్ఫరెన్స్​ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తద్వారా భారత ప్రభుత్వానికి తమ సేవలు అందించడం, వికసిత్ భారత్ –2047 లక్ష్యాలకు చేరువకావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

ప్రధానంగా ఇండియాను గ్లోబల్ స్టాండింగ్​లో ముందు వరుసలో నిలపాలన్నదే తమ ఉద్దేశమన్నారు. భారత్ లో ఏ ప్రభుత్వం ఉన్నా.. వారితో కలిసి నెదర్లాండ్స్ ఇండియన్ డయస్పోరా కలిసి పని చేస్తుందని స్పష్టం చేశారు. భారత దేశ అభివృద్ధి కోసం ఈ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసినట్టు సముద్రాల సాయి కిరణ్ తెలిపారు. ఏయే సెక్టార్ లో అభివృద్ధి చేయొచ్చు అనే అంశాలపై గడ్డం వంశీలాంటి ఇతర పారిశ్రామిక వేత్తల ఆలోచనలు స్వీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. అనంతరం ఎఫ్​సీసీఐ ప్రెసిడెంట్ అడ్వకేట్ జస్బీర్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ అగర్వాల్ ఎంపీని మెమోంటోతో సత్కరించారు.