ప్రపంచ కుబేరుల్లో అంబానీ ఫ్యామిలీ..బ్లూమ్‌‌‌‌బర్గ్ జాబితాలోని టాప్‌‌‌‌ టెన్‌‌‌‌ ఫ్యామిలీస్ ఇవీ..

ప్రపంచ కుబేరుల్లో అంబానీ ఫ్యామిలీ..బ్లూమ్‌‌‌‌బర్గ్ జాబితాలోని టాప్‌‌‌‌ టెన్‌‌‌‌ ఫ్యామిలీస్ ఇవీ..
  • బ్లూమ్‌‌‌‌బర్గ్ వరల్డ్ 25 రిచెస్ట్ ఫ్యామిలీస్‌‌‌‌ జాబితాలో 8వ స్థానం
  • సంపద దాదాపు రూ.9.50 లక్షల కోట్లు 
  • భారత్‌‌‌‌ నుంచి ఒకే ఫ్యామిలీ.. వరుసగా ఏడోసారి చోటు
  • లిస్టులో ఫస్ట్ ప్లేసులో వాల్‌‌‌‌మార్ట్ ఓనర్స్ వాల్టన్ ఫ్యామిలీ 
  • ఇండియాలో ఏటేటా పెరుగుతున్న ధనికుల సంపద
  • హంగర్ ఇండెక్స్​లో మాత్రం 102వ స్థానంలో మన దేశం

న్యూఢిల్లీ: మన దేశ బిజినెస్ టైకూన్ ముఖేశ్ అంబానీ కుటుంబం వరుసగా ఏడోసారి వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీస్‌‌‌‌ జాబితాలో చోటు దక్కించుకుంది. 2019 నుంచి ఈ జాబితాలో నిలుస్తున్న ఒకే ఒక్క ఇండియన్ ఫ్యామిలీగా రికార్డు సృష్టించింది. 2025 సంవత్సరానికి గాను వరల్డ్ 25 రిచెస్ట్ ఫ్యామిలీస్ లిస్టును బ్లూమ్‌‌‌‌బర్గ్ ఇటీవల విడుదల చేసింది. ఇందులో అంబానీ కుటుంబం 8వ స్థానంలో నిలిచింది.

వీళ్ల సంపదను దాదాపు రూ.9.50 లక్షల కోట్లు (105.6 బిలియన్ డాలర్లు)గా బ్లూమ్‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ అంచనా వేసింది. పోయినేడాదితో పోలిస్తే దాదాపు రూ.54 వేల కోట్లు పెరిగినట్టు లెక్కగట్టింది. అంబానీ కుటుంబం చేతుల్లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒక్కటి. పెట్రో కెమికల్స్, టెలీ కమ్యూనికేషన్స్, రిటైల్, డిజిటల్ సర్వీసెస్, ఎనర్జీ తదితర రంగాల్లో వీళ్ల వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. 

వాల్టన్ ఫ్యామిలీ మళ్లీ ఫస్ట్.. 

ఈ జాబితాలో అమెరికాకు చెందిన వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్ కంపెనీ ఓనర్స్ అయిన వాల్టన్ ఫ్యామిలీ మళ్లీ ఫస్ట్ ప్లేసులో నిలిచింది. వీళ్ల సంపద రూ.45 లక్షల కోట్లకు (అర ట్రిలియన్ డాలర్లు) పైగా ఉంది.  యూఏఈ ను పాలిస్తున్న అల్ నహ్యాన్ రాజకుటుంబం రెండో స్థానం దక్కించుకుంది. వీళ్ల సంపద రూ.30.12 లక్షల కోట్లు (335.9 బిలియన్ డాలర్లు)గా ఉంది. సౌదీ అరేబియాకు చెందిన అల్‌‌‌‌‌‌‌‌ సౌద్ రాజకుటుంబం మూడో స్థానంలో నిలవగా, వీళ్ల సంపద రూ.19.15 లక్షల కోట్లు (213.6 బిలియన్ డాలర్లు).  

ఇక ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అల్‌‌‌‌‌‌‌‌ థానీ రాజకుటుంబం నాలుగో స్థానంలో నిలవగా, వీళ్ల సంపద రూ.17.89 లక్షల కోట్లు (199.5 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన హెర్మెస్ ఫ్యామిలీ ఐదో స్థానంలో నిలవగా, వీళ్ల సంపద రూ.16.54 లక్షల కోట్లు (184.5 బిలియన్ డాలర్లు)గా ఉంది.  

కొత్తగా నాలుగు ఫ్యామిలీస్.. 

ఈసారి వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ జాబితాలో నిలిచిన అన్ని కుటుంబాల సంపద కలిపి రూ.260 లక్షల కోట్లు (2.9 ట్రిలియన్ డాలర్లు) ఉంటుందని బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ అంచనా వేసింది. ఇది పోయినేడాదితో పోలిస్తే రూ.32.16 లక్షల కోట్లు (358.7 బిలియన్ డాలర్లు) ఎక్కువని వెల్లడించింది. ఈసారి జాబితాలోకి కొత్తగా నాలుగు కుటుంబాలు చేరాయని తెలిపింది. అందులో మెక్సికోకు చెందిన లారియా మోటా వెలాస్కో ఫ్యామిలీ, చిలీకి చెందిన లుక్సిక్ ఫ్యామిలీ, ఇటలీకి చెందిన డెల్‌‌‌‌‌‌‌‌ వెచియో ఫ్యామిలీ, సౌదీ అరేబియాకు చెందిన ఒలయన్ ఫ్యామిలీ ఉన్నట్టు పేర్కొంది. 

ఏటా పెరుగుతున్న ధనికుల సంపద

మన దేశంలో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. ఏటేటా వాళ్ల సంపద పెరిగిపోతున్నది.  దేశంలోని కొంతమంది చేతుల్లోనే అత్యధిక సంపద పోగై ఉన్నది. ముఖ్యంగా అంబానీ, అదానీ గుత్తాధిపత్యంలో దేశవ్యాప్తంగా బిజినెస్ నడుస్తున్నది. అదానీకి కూడా అంబానీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. అయితే అదంతా మొదటి తరం సంపద కావడంతో బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ లిస్టులో చోటు దక్కలేదు. 

కానీ వరల్డ్ బిలియనీర్ల జాబితాలో అదానీ ఎప్పుడూ టాప్ 20లో ఉంటారు. ఆయనతో పాటు శివ్ నాడార్, సావిత్రి జిందాల్, అజీమ్ ప్రేమ్‌‌‌‌‌‌‌‌జీ లాంటి వాళ్లు బిలియనీర్ల జాబితాలో ఉన్నారు. కాగా, మన దేశంలో పేదలు ఆకలితో అల్లాడుతున్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్–2025 జాబితాలో భారత్ 102వ స్థానంలో ఉంది. మనకంటే శ్రీలంక (56), నేపాల్ (68), బంగ్లాదేశ్ (84) మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.