- ఆమెతో పాటు ..మరో ముగ్గురు అరెస్ట్
పాల్వంచ, వెలుగు : భర్త హత్య కేసులో భార్యతో పాటు మరో ముగ్గురు నిందితులను భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీశ్ కుమార్ శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. పాల్వంచ టౌన్ వెంగళరావు కాలనీకి చెందిన ధరావత్ హరినాథ్(39), భార్య శృతిలయ ములుగు జిల్లా వాజేడు మండలం వెంకటాపురం ఏరియాలో ఫారెస్ట్ బీట్ఆఫీసర్ గా చేస్తోంది.
ఆమెకు చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన కొండా కౌశిక్ తో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్తను అడ్డుతొలగించుకునేందుకు శృతిలయ ప్రియుడు కౌశిక్ తో పాటు వాజేడు మండలం ఎచ్చర్లపల్లికి చెందిన చెన్నం మోహన్, ఎటపాక మండలం రాయన్నపేటకు చెందిన డేగల భానుతో కలిసి ప్లాన్ చేసింది.
ఈనెల15న భర్త మద్యం మత్తులో పడిపోయి ఉండగా గొంతు నులిమి చంపేశారు. ఇంట్లో శ్లాబుకు తాడుతో వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు. మృతుడి తల్లి మంగమ్మ ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా భర్తను చంపినట్టు అంగీకరించింది. ఆమెతో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. పాల్వంచ సీఐ కె. సతీశ్, టౌన్ ఎస్ఐ సుమన్, అడిషనల్ ఎస్ఐ జీవన్ రాజ్, ట్రైనీ ఎస్ఐ కళ్యాణి ఉన్నారు.
