సుప్రీంకోర్టు తీర్పు మాకు వర్తించదు

సుప్రీంకోర్టు తీర్పు మాకు వర్తించదు
  • పేట్​బషీరాబాద్, నిజాంపేట గ్రేటర్​లో ప్రాంతాలు కాదు..
  • ‘జవహర్​లాల్​సొసైటీ’  భూములను రీ సర్వే చేయాలి  
  • సొసైటీ మెంబర్స్​ డిమాండ్​

హైదరాబాద్​ సిటీ, వెలుగు:  జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ సభ్యులకు పేట్​బషీరాబాద్, నిజాంపేటలో ఇచ్చిన భూములను రీ సర్వే చేయించాలని సొసైటీ సభ్యులు డిమాండ్​ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో సొసైటీ సభ్యులు మాట్లాడారు. భూముల కోసం ప్రభుత్వానికి రూ.12 కోట్ల 33 లక్షలు చెల్లించామని, ఐఅండ్​పీఆర్​ ద్వారా నిజాంపేటలో 32 ఎకరాలు, పేట్​బషీర్​బాగ్​లో 38 ఎకరాలు కేటాయించారన్నారు. సుప్రీంకోర్టు 2022లో 2010లో హైకోర్టు ఆర్డర్​ కాపీని పరిగణలోకి తీసుకుని తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. 

గతేడాది రవీంద్రభారతిలో కాంగ్రెస్​ సర్కారు పట్టాలు కూడా అందజేసిందన్నారు. అయితే, 2024లో సుప్రీం కోర్టు మళ్లీ గ్రేటర్​ ​పరిధిలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడాన్ని తప్పు పట్టిందన్నారు. దీంతో ప్రభుత్వం మళ్లీ వెనకడుగు వేసిందన్నారు. ఈ తీర్పు తమకు కేటాయించిన భూములకు వర్తించదన్నారు. తమకు కేటాయించినప్పుడు ఆ భూములు జిల్లా, పంచాయతీ ఆధీనంలో ఉన్నాయని, ఇప్పటికీ జిల్లా, మున్సిపల్​శాఖ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. కేటాయించిన భూములను కొందరు అక్రమార్కులను కబ్జా చేశారన్నారు. అధికారులు భూమిని రీ సర్వే చేసి, సొసైటీ సభ్యులకు భూమి అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సొసైటీ మెంబర్స్​​శివకుమార్​ రెడ్డి, మంజుల, షరీఫ్​, శ్రీనివాస్​ రావు పాల్గొన్నారు.