- శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
- పాలనలో ఆదా అయ్యే సమయం ప్రజలకు సేవలుగా దక్కాలి
- డేటా భద్రతలో రాజీ పడొద్దు..తుది బాధ్యత అధికారులదేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి, రోజువారీ పాలనలో ఏఐను సమర్థవంతంగా వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ఏఐ సాధనాల వినియోగం ద్వారా పనుల్లో వేగం పెరగడమే కాకుండా, సమయం గణనీయంగా ఆదా అవుతుందని తెలిపారు.
ఈ మేరకు గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రణాళికా శాఖ సహకారంతో ‘టీజీ మ్యాథ్’ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఏఐ సాక్షమ్’ ఉద్యోగుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఏఐతో ఆదా అయిన సమయాన్ని ప్రజల సమస్యలను శ్రద్ధగా పరిష్కరించేందుకు, నాణ్యమైన సేవలందించేందుకు కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల విశ్లేషణ, క్లిష్టమైన నివేదికల తయారీ, డేటా ప్రాసెసింగ్ వంటి పనులను ఏఐతో వేగవంతం చేయవచ్చన్నారు.
ఒక రైతు దరఖాస్తు సత్వరమే పరిష్కారం కావడం, పింఛనుదారుడికి అందాల్సిన ప్రయోజనాలపై స్పష్టత రావడం, పౌరులు తమ పనుల కోసం పదేపదే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గడమే సాంకేతికతకు అసలైన గీటురాయి అని స్పష్టం చేశారు.
ఫైనాన్స్, ప్లానింగ్, విద్యుత్ రంగాల్లో ఏఐ వినియోగానికి ప్రాధాన్యం
ప్రభుత్వ పరిధిలోని ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ రంగాల్లో ఏఐ వినియోగంతో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రజాధనం ఖర్చును సమగ్రంగా విశ్లేషించడం, ప్రాజెక్టుల వ్యయాలను సరిపోల్చడం, పనుల అమల్లో ఏర్పడే జాప్యాలను గుర్తించడంలో ఏఐ సాధనాలు అధికారులకు విశేషంగా సహాయపడతాయని తెలిపారు. ప్రణాళికా విభాగంలో సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరుతున్నాయో లేదో తెలుసుకోవడానికి, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విధానాలు రూపొందించడానికి క్షేత్రస్థాయి గణాంకాలతో కూడిన ఏఐ విశ్లేషణలు దోహదపడతాయని చెప్పారు.
విద్యుత్ రంగంలో విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేయడం, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర యంత్ర పరికరాల్లో తలెత్తే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి మరమ్మతులు చేపట్టడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు, పరిశ్రమలకు, ఆసుపత్రులకు అంతరాయం లేని నిరంతర విద్యుత్‌ను అందించవచ్చని వెల్లడించారు. ప్రతి శాఖ తమ పరిధిలో ఏఐని ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఫలితాల ఆధారంగా విస్తరించాలని దిశానిర్దేశం చేశారు.
అనుమతి లేని టూల్స్‌లో అధికారిక సమాచారం నమోదు చేయొద్దు
ఏఐ సాధనాలను వినియోగించే సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ సమాచార భద్రత, కచ్చితత్వానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేని థర్డ్ పార్టీ టూల్స్‌లో అధికారిక దస్త్రాలు లేదా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నమోదు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏఐ అందించిన సమాచారాన్ని అధికారులు స్వయంగా సరిచూసుకున్న తర్వాతే రికార్డుల్లో చేర్చాలని, నిర్ణయాలకు ప్రాతిపదికగా తీసుకోవాలని వివరించారు.
సాంకేతికత ఎంత సాయపడినా తుది నిర్ణయం, దానికి సంబంధించిన పూర్తి బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పారు. ఈ శిక్షణను ఉద్యోగులు సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, డిప్యూటీ సీఎం సెక్రటరీ, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, టీజీ మ్యాథ్ ఎండీ పూజ, ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
