సభలో అక్బరుద్దీన్ చాలెంజ్ కామెంట్స్ సరికాదు : భట్టి విక్రమార్క

సభలో అక్బరుద్దీన్ చాలెంజ్ కామెంట్స్ సరికాదు : భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీలో కరెంట్ అప్పులపై చర్చ హాట్ గా సాగింది.  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మైనార్టీల సంక్షేమం కోసం తమకు మరోకరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించి చేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఐఎం పార్టీ భాగస్వామ్యం కాదా..? అని ప్రశ్నించారు. మైనార్టీలను సీఎం, రాష్ట్రపతిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్పారు. ఎంఐఎం కూడా అధికారంలో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ఆ పార్టీతో ఎంఐఎం పార్టీ కలిసి ఉంటుందని చెప్పారు. ఓ దళిత ఎమ్మెల్యేలను అక్బరుద్దీన్ అవమానించడం సరికాదన్నారు. హైదరాబాద్ సౌత్ లోనే కరెంటు మొండి బకాయిలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ అలీ ఓటమికి ఎంఐఎం పార్టీ ఎలా కారణమని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపామన్నారు.  అయితే... గతంలో జూబ్లీహిల్స్ లో పోటీ చేయని ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఎందుకు పోటీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఎంఐఎం పార్టీ సభ్యులు విలువైన సలహాలు ఇస్తే బాగుంటుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సభా నాయకుడు (సీఎం రేవంత్ రెడ్డి) మాట్లాడుతుంటే అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. అక్బరుద్దీన్ చాలెంజ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. చేతనైతే సబ్జెక్ట్ మీద మాట్లాడండి అని సూచించారు.

మాట్లాడితే తమను బీజేపీ బీ టీమ్ అని విమర్శిస్తారని చెప్పారు అక్బరుద్దీన్. తాము బీజేపీ బీ టీమ్ ఎప్పటికీ కాదన్నారు. తాము ఏ పార్టీలతో ఉన్నా హక్కుల కోస కొట్లాడామన్నారు.  తాము పోటీ చేస్తే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఓడిపోయారనడం కరెక్టు కాదన్నారు. 

ఎంఐఎం వాళ్లకు దమ్ముంటే సబ్జెక్ట్ పై మాట్లాడండి అని కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు.