న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ పేలుడు కలకలం రేపింది. ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదు కార్లు ధ్వంసం కాగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోట (లాల్ ఖిలా) మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 దగ్గర సోమవారం సాయంత్రం ఒక కారులో పేలుడు సంభవించింది. ఢిల్లీలోనే అత్యంత హై సెక్యూరిటీ జోన్లో ఈ పేలుడు జరగడంతో ఢిల్లీ ఉలిక్కిపడింది. ఈ ఘటన భయాందోళనలకు గురిచేసింది.
పేలుడు ధాటికి మరో మూడు వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీ అగ్నిమాపక శాఖ ప్రకారం, సాయంత్రం 6:55 గంటలకు పేలుడు గురించి ఫైర్ సిబ్బందికి కాల్ వచ్చింది. ఆ తర్వాత ఏడు అగ్నిమాపక వాహనాలు, 15 CAT అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనలో కొంతమందికి గాయాలు అయినట్లు తెలిసింది. ఇద్దరికి గాయాలయ్యాయని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. పేలుడుకు ఖచ్చితమైన కారణం ఏంటనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ పేలుడు ఘటనలో కుట్ర కోణం ఏమైనా ఉందనే కోణంలో దర్యాప్తు మొదలైంది. ఉగ్రవాదుల చర్య అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో, అదీ ఎర్రకోట దగ్గర భారీ పేలుడు ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది.
