- విస్తృతంగా వైరల్ చేస్తున్న పార్టీలు
- ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగం
- కాంగ్రెస్ టార్గెట్ గా బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం
- మరికొద్ది గంటల్లో పోలింగ్ అనగా మైండ్ గేమ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో ఫేక్ ప్రచారం మొదలైంది. వీడియోలు, కంటెంట్ ఎడిట్ చేస్తూ సోషల్ మీడియాలోకి వదులుతుండటం గమనార్హం. కొందరు సోషల్ మీడియా వారియర్స్ ఏకంగా ఏఐ జనరేటెడ్ వీడియోలను కూడా ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టా తదితర ప్లాట్ ఫాంలలో షేర్ చేస్తున్నారు. దీంతోపాటు లోకల్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ ఈ వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. వెలుగు దినపత్రికకు సంబంధించిన ఫేక్ క్లిప్ లను తయారు చేసి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చిచ్చు పెట్టే చర్యలకు కొందరు పాల్పడుతున్నారు.
రీల్స్, షాట్స్
సీఎం, మంత్రులు మాట్లాడిన వీడియోలను కత్తిరించి తమకు అనుకూలంగా అతికించుకొని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతుండటంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. వాటిని ఇన్ స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ మాత్రమే కాకుండా వాట్సాప్ క్లిప్పులుగా కూడా షేర్ చేస్తుండటం గమనార్హం.
పత్రికల పేరుతో క్లిప్పింగ్స్
రోజూ నమాజ్ చేసే బదులు స్నానం చేయండి.. అని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నట్టు ఒక ఫేక్ క్లిప్ కూడా వైరల్ అవుతోంది. ఈ క్లిప్ వైరల్ చేయడం ద్వారా ముస్లిం ఓటర్లను నవీన్ యాదవ్ కు దూరం చేయడం టార్గెట్ గా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా వెలుగు దినపత్రిక క్లిప్పింగుల తయారీ కోసం ఒక ఫ్యాక్టరీయే నడుస్తున్నట్టుంది. ఇబ్బడి ముబ్బడిగా క్లిప్పింగులను వండి వార్చుతుండటం గమనార్హం.
లెటెస్ట్ సర్వేలు!!
కొందరు లెటెస్ట్ సర్వే పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. పార్టీల వారీగా గ్రాఫ్లు చూపిస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారు. అదిగో పాము అంటే ఇదిగో తోక అన్నట్టుగా.. నిజమని నమ్మించేలా వీడియోలు, రీల్స్ పెడుతూ గందరగోళానికి గురి చేస్తుండటం గమనార్హం.
►ALSO READ | జూబ్లీహిల్స్ లో గెలుస్తున్నాం.. మెజార్టీపైనే దృష్టి పెట్టండి: సీఎం రేవంత్
పోలీసులు యాక్షన్ తీసుకోవాలి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి దుష్ప్రవర్తనలకు పాల్పడుతున్నారని ఏఐ క్రియేటెడ్ వీడియోలను వైరల్ చేస్తున్నారని చెప్పారు.
ఓటర్లను తప్పుదారి పట్టించడానికి బీఆర్ఎస్ నాయకులు నకిలీ ఫొటోలు, వీడియోలతో జోరుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడంతోపాటు డబ్బులు పంచి గెలవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. వీరిపై సైబర్ క్రైం పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
