
కాంగ్రెస్ ప్రభుత్వానికి కక్ష సాధించాల్సిన అవసరం లేదని...చట్టం ప్రకారమే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన భట్టి.. వాస్తవాలను బయటకు తీసేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పనిచేసిందన్నారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును పొలిటికల్ సర్కస్..కాంగ్రెస్ కమిషన్ అనడం కరెక్టేనా?అని మండిపడ్డారు భట్టి.
బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన భట్టి.. కాళేశ్వరంలో లక్షకోట్లు దోపిడి చేశారు..అంచనాలు పెంచి బడ్జెట్ పెంచారు. ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడుతారు. హరీశ్ అసలు సబ్జెక్టును పక్కనపెట్టి అన్ని మాట్లాడుతున్నారు. దేశంలో నీళ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. మనం కూడా నీళ్ల కోసమే పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సభను శాసిస్తామంటే సరికాదు. చర్చ కోసం సభకు వచ్చి అల్లరి చేస్తున్నారు. కమిషన్ రిపోర్టుపై చర్చ జరగాలని లేదా?. ప్రాజెక్టులు అంటే ఆధునిక దేవాలయాలు. దశాబ్దాల కింద కట్టిన ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడుతుంటే.. లక్ష కోట్లు దోపిడి చేసి కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది. కూలిపోయిన ప్రాజెక్టుపై చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పాల్సిందంతా చెప్పి తొండి చేస్తామంటే ఎలా? రాజకీయ ఆరోపణలు చేయలేదు..కక్షసాధింపులు అసలే లేవు. కట్టిన పది రోజుల్లోనే కూలిపోతే ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కాళేశ్వరంపై మా పార్టీ వాదనలను వినిపించడం లేదు. కమిషన్ రిపోర్టుపైనే మాట్లాడుతున్నాం అని భట్టి అన్నారు.
భట్టి మాట్లాడుతుండగా..మరో వైపు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.