బీజేపీ, బీఆర్ఎస్ ​రెండూ ఒకటే.. అందుకే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపిస్తలేం: భట్టి

బీజేపీ, బీఆర్ఎస్ ​రెండూ ఒకటే.. అందుకే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపిస్తలేం: భట్టి
  •    బీఆర్ఎస్​ దోపిడీపై కేంద్రం ఇప్పటి దాకా ఎందుకు చర్యలు తీసుకోలే?
  •     జ్యుడీషియల్​ఎంక్వైరీలో అన్ని విషయాలు బయటకొస్తయ్​
  •     భగీరథ అక్రమాలపైనా రిపోర్ట్​రెడీ అవుతున్నదన్న డిప్యూటీ సీఎం

ఖమ్మం, వెలుగు: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి కాబట్టే.. కాళేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా గతంలో అన్నారని, బీఆర్ఎస్​ దోపిడీ గురించి పూర్తి సమాచారం ఉన్నా..  కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఆదివారం తన సొంతూరు ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఉన్న సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో పనిచేస్తాయి కాబట్టి తాము సీబీఐ విచారణకు కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకులు బాధ్యత లేనట్టుగా నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ, నోట్ల రద్దు సమయంలో బయటికి తీస్తానన్న నల్లధనం గురించి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని మన రాష్ట్రం నుంచి పార్లమెంట్​స్థానానికి పోటీ చేయాలని కోరామని, ఆమె పోటీ చేసే పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయొద్దన్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవాలని కోరారు.

అవకతవకలు బయటపెడ్తాం..

గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథలో జరిగిన అవకతవకలపై నివేదిక తయారవుతోందని, త్వరలోనే దాన్ని బయట పెడతామని భట్టి చెప్పారు. గత ఐదేండ్ల నుంచి ఉద్యోగులు 21వ తేదీన జీతాలు తీసుకున్న దుస్థితి నుంచి, మొదటి వారంలోనే జీతాలు ఇచ్చేలా ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట లక్ష కోట్ల రూపాయల అప్పు తెచ్చి అధోగతి పాలు చేసిన తీరుపై జ్యుడీషియల్ విచారణకు సిద్ధమైనట్లు తెలిపారు. విద్య,  వైద్యం, ఉపాధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రణాళిక సంఘాన్ని తిరిగి పునరుద్ధరణ చేసి, ఆ శాఖకు సీనియర్ ఐఏఎస్ అధికారిని సెక్రటరీగా నియమించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, పైరవీలు, ప్రశ్న పత్రాల లీకులు లేకుండా టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఒత్తిడి లేని పాలన అందిస్తామని చెప్పినట్టుగానే చేస్తున్నామని గుర్తు చేశారు.

శాంతి భద్రతల పరిరక్షణకు కఠినంగా వ్యవహరించడమే కాకుండా ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా గుర్తించి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పైరవీకారులు, తాబేదారులకు తావు లేకుండా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా 30 రోజులు ప్రజాపాలన అందించిందని వెల్లడించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని,  ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేసి విద్యార్థులకు ఉపయోగపడే వృత్తిపరమైన కోర్సులు తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్​మెంట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని చెప్పారు. ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తదితరులు ఉన్నారు.