- హరీశ్‌రావు ఓకే అంటే సిట్ లేదా
- ఇతర సంస్థలతో విచారణకు ఆదేశిస్తం
- సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడు..
- సింగరేణి టెండర్లు దక్కగానే సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది అయిండా?
- కాంగ్రెస్ హయాంలోనూ బీఆర్ఎస్ వాళ్లకే టెండర్లు.. హరీశ్ అబద్ధాలు మానేయాలి
- గద్దలు, రాబందుల నుంచి సింగరేణిని కాపాడుకుంటాం
- కొత్త పలుకు పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విషపు రాతలు రాస్తున్నడని ఫైర్
- వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోబోనని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: సింగరేణి టెండర్లపై ఎంక్వైరీ చేయడానికి తమ ప్రభుత్వం రెడీగా ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాడిచర్ల ఓబీ కాంట్రాక్ట్‌తోపాటు 2014 నుంచి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులపై విచారణ చేయిస్తామని చెప్పారు. సింగరేణికి చెందిన నైనీ బొగ్గు గనుల టెండర్లకు సంబంధించిన అంశాలపై తన పేరును ప్రస్తావిస్తూ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాసిన కథనం.. ఆ తర్వాత సింగరేణిలో అవినీతి జరుగుతున్నదంటూ హరీశ్ రావు రాసిన లేఖ.. దీనికి కిషన్ రెడ్డి స్పందించి విచారణ కమిటీని నియమించడంలాంటి అంశాలపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ప్రజాభవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. రెండు గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘సింగరేణిపై విచారణ జరపాలని కిషన్ రెడ్డికి హరీశ్ రావు లెటర్ రాయడం కాదు.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ శాఖ మంత్రినైన నాకు రాయాలి. త్వరలోనే సీఎం రేవంత్ రాష్ట్రానికి వస్తున్నారు. నేనే స్వయంగా వెళ్లి సీఎంను ఒప్పించి 2014 నుంచి ఇప్పటివరకు సింగరేణిలో జరిగిన టెండర్లు, బిడ్డర్లు, ఒప్పందాలపై అధికారికంగా విచారణ జరిపిస్తా.. హరీశ్ ఓకే అంటే సిట్ లేదా ఇతర సంస్థలను వెంటనే విచారణకు ఆదేశిస్తం” అని పేర్కొన్నారు.
అసలు నిజాలు తెలుస్తయ్..
సింగరేణిలో నైనీ బొగ్గు గనుల టెండర్ల రద్దు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేసిన టెక్నికల్ కమిటీ విచారణను తమ ప్రభుత్వం స్వాగతిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ విచారణ వల్ల అసలు నిజాలేంటో ప్రపంచానికి తెలిసిపోతుందన్నారు. ‘‘సింగరేణి 4 కోట్ల ప్రజల ఆస్తి. దీనిపై వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లడం రాష్ట్రానికి నష్టం చేస్తుంది. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు దోచుకోవడానికి కాదు. ప్రజల ఆస్తులను కాపాడటానికే వచ్చాను’’ అని వ్యాఖ్యానించారు. తాను మండుటెండలో పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహించి సింగరేణి గనులను సందర్శించానని, సింగరేణి కార్మికుల రక్తం, స్వేదంతో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, అలాంటి బొగ్గు సంపదపైన ఎలాంటి రాబందులు, గద్దలు, పెద్దలను వాలకుండా చూడడమే తన కర్తవ్యమన్నారు. భవిష్యత్ అవసరాలరీత్యా సింగరేణి బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత పదేండ్లలో కొత్త బొగ్గు గనుల అభివృద్ధిలో తగిన ప్రయత్నాలు జరగకపోవడం వల్ల భవిష్యత్తులో ఉత్పత్తి, ఆదాయం తగ్గి వేలాది సింగరేణి కార్మిక కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో జరుగుతున్న మార్పులు, గ్రీన్ ఎనర్జీ వైపు పడుతున్న అడుగుల నేపథ్యంలో నాణ్యమైన బొగ్గు గనులను త్వరగా సొంతం చేసుకుని ఆపరేషన్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, సింగరేణిని కేవలం బొగ్గుకే పరిమితం చేయకుండా క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయాన్ని భట్టి గుర్తుచేశారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే కదా?
సింగరేణి టెండర్లను సీఎం రేవంత్ బావమరిదికి కట్టబెడుతున్నట్టు హరీశ్ రావు ఒక కట్టు కథను ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. హరీశ్ రావు చెబుతున్న సుజన్ రెడ్డి.. పాలేరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ లీడర్ కందాల ఉపేందర్ రెడ్డికి స్వయాన అల్లుడని తెలిపారు. ‘‘సుజన్ రెడ్డి కంపెనీ శోధా కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ దీప్తిరెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి కూతురు. ఈమె భర్తనే సుజన్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత తన వ్యక్తిగత అవసరాల కోసం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ సమయంలో ఆయన కూతురు, అల్లుని కంపెనీలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనేక వర్క్‌లు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక ఒకటో, రెండో టెండర్లు దక్కగానే బీఆర్ఎస్ నేత అల్లుడిని కాస్తా సీఎం రేవంత్‌కు బామ్మర్దిని చేస్తారా?’’ అని నిలదీశారు. ఇకనైనా హరీశ్ రావు అబద్ధాలు చెప్పడం మానేయాలన్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా సింగరేణిలో 25 టెండర్లు జరిగితే.. తమ ప్రభుత్వ హయాంలో నాలుగు టెండర్లు మాత్రమే ఇచ్చామని భట్టి తెలిపారు. ఆ నాలుగు టెండర్లను కూడా చట్టప్రకారం నిర్వహించి.. ఒక్కో చోట 6 నుంచి 12 కంపెనీలు పోటీ పడితేనే అందులో తక్కువకు కోట్ చేసిన సంస్థలకు పనులు అప్పగించామని వివరించారు. వీటిలో కూడా బీఆర్‌ఎస్ నేతల కుటుంబ సభ్యులు, బంధువుల కంపెనీలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ‘‘హరీశ్ రావుకు కానీ.. ఇంకా ఎవరికైనా కానీ అనుమానాలు ఉన్నట్లయితే నైనీ బ్లాక్ టెండర్ పైనే కాకుండా 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని రకాల టెండర్లపై కూడా విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సీఎం రేవంత్ రాగానే నేను స్వయంగా ఆయనతో మాట్లాడి విచారణకు ఆదేశించేలా చూస్తా’’ అని భట్టి పేర్కొన్నారు. అప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు.
కాంగ్రెస్ హయాంలోనూ బీఆర్ఎస్వాళ్లకే టెండర్లు
- కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి టెండర్లలో అవినీతి అక్రమాలు జరిగినట్టు హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా తమ దగ్గరి బంధువులకు టెండర్లు దక్కేలా చేశారని అబద్ధాలు చెబుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక సింగరేణిలో జరిగిన టెండర్లు, దక్కించుకున్న కంపెనీలు, అవి ఎవరికి చెందినవో ఆ వివరాలను డిప్యూటీ సీఎం మీడియాకు వెల్లడించారు.
- ప్రస్తుత బీఆర్ఎస్ లీడర్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూతురు దీప్తిరెడ్డి, అల్లుడు సుజన్ రెడ్డికి చెందిన శోధా కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమి టెడ్‌కు కొత్తగూడెం వీకేఓసీ–1 టెండర్ 2023 సెప్టెంబర్ 25న దక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇదే కంపెనీకి పక్కనే ఉన్న వీకేఓసీ–2 ప్రాజెక్టును 2022 అక్టోబర్‌లో అధిక రేటుతో కేటా యించారు.
- మందమర్రిలోని కల్యాణ ఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు లో 12 మంది బిడ్డర్లు పాల్గొనగా.. ప్రతిమ గ్రూప్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ వే ఆర్వీఎస్ఆర్(ఆర్ విద్యాసాగర్ రావు)కు చెందిన కంపెనీకి 2025 మే 24న దక్కింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు మేనల్లుడి చెందిన కంపెనీ ఇది. -
- రామగుండం ఓసీ–2 ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టులో ఆరు గురు బిడ్డర్లు పాల్గొనగా.. సీ5 ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కంపెనీకి 2025 జూలై 4న టెండర్ దక్కింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ సుధా కర్‌రావు కుటుంబానికి చెందిన కంపెనీ ఇది. కేసీఆర్, హరీశ్ రావు బంధువులు వీళ్లు. శ్రీరాంపూర్ ఓసీ –2 ప్రాజెక్టులో 12 మంది బిడ్డర్లు పాల్గొనగా హర్ష కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 2025 అక్టోబర్ 22న టెండర్ దక్కింది. ఈ సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్వహించింది. మాజీ ఈఎన్సీ ఇరిగేషన్ మురళీధర్ రావుతో డబ్బుల లావాదేవీల ఆరోపణలపై ఏసీబీ విచారణలో ఉంది. ఈ కంపెనీకి హరీశ్ రావుతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
హరీశ్ అబద్ధాలు మానేయాలి
సింగరేణిలో డీజిల్ సరఫరాను కాంట్రాక్టర్లకే అప్పగించడం ద్వారా మరో కుంభకోణానికి తెరలేపారన్న హరీశ్ రావు ఆరోపణలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు. డీజిల్ సరఫరా విధానంలో మార్పులు కూడా తమ హయాంలో జరగలేదని, 2022లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఈ విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. జీఎస్టీ విధాన మార్పులు, డీజిల్ దొంగతనాలు నివారించడా నికే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంట్రాక్టుల్లోనూ ఈ పద్ధతే అమల్లో ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. డీజిల్ కుంభకోణంపై ప్రస్తుతం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నదని, ఇందులో పలువురు ప్రభుత్వ అధికారుల పేర్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ స్కామ్ వివరాలు బయటికొస్తాయని చెప్పారు.
విషపు రాతల రాధాకృష్ణ!
నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కథనంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. ‘‘పెట్టుబడులు, కట్టు కథల విషపు రాతల రాధాకృష్ణ నాపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. వాస్తవ దూరమైనవి. రాధాకృష్ణ ఎవరి సంతోషం కోసం, ఎవరిని ఆనందపరచడం కోసం రాశాడో ఆయనకే తెలియాలి. ఆ వార్త తర్వాత రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలు నన్ను ఎంతగానో బాధించాయి. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న కథనాలు నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. ముఖ్యంగా సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాకు కాంట్రాక్ట్ విషయంలో ఏజెన్సీలు ముందుగా సైట్ విజిట్ చేయాలని, ఆ మేరకు గని అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందితేనే బిడ్డింగ్‌కు అర్హత కల్పిస్తూ తానేదో కొత్త నిబంధన పెట్టినట్లు రాధాకృష్ణ తన తొలి పలుకులో రాశారు.
ఈ నిబంధన దేశంలో మరెక్కడా లేదని, కేవలం భట్టి విక్రమార్కకు చెందిన వారికి కాంట్రాక్టు అప్పగించడానికే ఇలా చేశారంటూ కట్టు కథలు, పిట్ట కథలను అల్లి వార్త ప్రచురించారు. సైట్ విజిట్ నిబంధన తెచ్చింది కాంగ్రెస్ సర్కారు కాదు. సైట్ విజిట్ చేయడం అనేది కేవలం సింగరేణిలో తమ హయాంలో ప్రవేశ పెట్టింది అంత కన్నా కాదు. ఇవిగో ఇవే సాక్ష్యాలు.. రుజువులు.. బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే 2018, 2021, 2023లోనే ఈ నిబంధనలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అనేక సంస్థలు సైట్ విజిట్ నిబంధనపై అనేక టెండర్లు ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కోలిండియా అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐఎల్ రూపొందించిన సింగరేణి టెండర్ డాక్యుమెంట్‌లో, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్ఎండీసీ, ఐఐటీ, ఐఐఎం, ఫైనాన్స్ విభాగం, డిఫెన్స్ విభాగం, గుజరాత్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర చాలా కంపెనీల్లో చాలా ఏండ్లుగాఈ నిబంధనలు ఉన్నాయి. ఆయా కంపెనీలకు సంబంధించిన టెండర్ లెటర్లు మీకందరికీ అందజేస్త. 40 ఏండ్లుగా ఉన్నత విలువలతో పనిచేస్తున్నా.నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోను. వ్యక్తిత్వ హననానికి రాధాకృష్ణ పూనుకున్నారు. అందుకే వాస్తవాలు వివరించాను. సింగరేణి ఆస్తులను కాపాడడం నా విధి. తెలంగాణ ఆత్మ సింగరేణి. దీనిపై గద్దలను, రాబందులు, పెద్దలను వాలనీయకుండా కాపాడుకుంటా. 40 ఏండ్ల నా రాజకీయ జీవితం రాధాకృష్ణ పెన్నుతో రాసే ఒక్క రాతతో చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. ఎన్నో ఉన్నత విలువలు కలిగి ఉన్న నా వ్యక్తిత్వంపై దాడి సమంజసం కాదు. రాధాకృష్ణ గారూ.. మీరంటే మాకు గౌరవం ఉంది. మీరు రాసిన రాతలన్నీ అవాస్త వాలు అని స్వయంగా ఒప్పుకొని తిరిగి వాస్తవాలు రాయాలి. లేనట్లయితే మీ రాతల వల్ల నాకు వ్యక్తిత్వ హననం జరిగినదిగా భావించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.
