పాదయాత్రల్లో షర్మిల, భట్టీ బిజీబిజీ​

 పాదయాత్రల్లో షర్మిల, భట్టీ బిజీబిజీ​
  • మళ్లీ జిల్లాకు రానున్న ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్​ 
  •  పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారంటున్న నేతలు

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు రెండు నెలల నుంచి పొలిటికల్ పాదయాత్రలు కొనసాగుతున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వైఎస్ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే బీఎస్పీ స్టేట్​ కోఆర్డినేటర్​ ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్​ ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో యాత్రను కొనసాగించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క ముందుగా నిర్ణయించిన ప్రకారమైతే మధిర నియోజకవర్గంలోనే యాత్ర ముగించాల్సి ఉంది. అయితే లేటెస్ట్ గా వైరా నియోజకవర్గంలో కూడా యాత్రను కంటిన్యూ చేయనున్నారు. తర్వాత పార్టీ ఆదేశాలను బట్టి రాష్ట్రం మొత్తం యాత్రపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు షర్మిల పాదయాత్ర చేవెళ్లలో ప్రారంభం కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆమె ఎంటర్​ అయ్యారు. ప్రస్తుతం ఖమ్మం మీదుగా పాలేరు నియోజకవర్గానికి వెళ్లనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల పాదయాత్ర చేస్తున్నా, ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఎక్కువగా ఫోకస్​ పెట్టినట్టు కనిపిస్తోంది. గతంలో వైఎస్ఆర్​సీపీ తరపున ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ సీటు, మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్​టీపీ ఇక్కడ సీట్లు గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ ప్రకటించిన సమయంలో బహిరంగ సభ కూడా ఖమ్మంలోనే నిర్వహించారు.  ఇక షర్మిల స్వయంగా పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉంటారని ముందు నుంచి టాక్  నడుస్తోంది. ఇక ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ రోజులు పాదయాత్ర చేయడం, నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలపై ఫోకస్​ పెడుతున్నారు. షర్మిల, భట్టి విక్రమార్క ఇద్దరూ పూర్తిగా పాదయాత్ర చేస్తుండగా, ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్​ మాత్రం గ్రామాల మధ్య వాహనంలో ప్రయాణిస్తూ, ఎక్కువ ప్రాంతాలను కవర్​ చేస్తున్నారు. ఊళ్లలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురు లీడర్లు కూడా సామాన్యుల సమస్యలు తెలుసుకుంటూ, వాళ్లతో మమేకమవుతూ, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ యాత్ర కంటిన్యూ చేస్తున్నారు.  

గ్రామాలను టచ్​ చేస్తూ..

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొనేందుకు పీపుల్స్ మార్చ్​ పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి 27 న పాదయాత్రను మొదలుపెట్టారు. ముందుగా ప్రకటించిన ప్రకారమైతే మధిర నియోజకవర్గంలో 506 కిలోమీటర్ల పాటు అన్ని గ్రామాలను టచ్​ చేస్తూ పాదయాత్రకు ప్లాన్​ చేశారు. మధ్యలో వివిధ కారణాలతో కొద్ది రోజుల పాటు ఆగుతూ పాదయాత్ర కంటిన్యూ అవుతోంది. ఈనెల 18తో మధిరలో యాత్ర ముగిసిన తర్వాత, వైరా నియోజకవర్గంలో దాదాపు 20 రోజుల పాటు పాదయాత్ర చేసేందుకు భట్టి రూట్​ మ్యాప్​ సిద్ధం చేసుకుంటున్నారు. పాదయాత్రకు రెస్పాన్స్​ బాగుండడం, రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్​ చేసి భట్టిని అభినందించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భట్టి యాత్రకు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. దీంతో వైరాలో పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఉమ్మడి జిల్లాలో యాత్ర ముగించుకొని, విడతల వారీగా మిగిలిన జిల్లాల్లో యాత్రకు ఆయన అనుచరులు షెడ్యూల్​ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.